సర్కార్ స్కూళ్లలో మెరుగైన విద్య
ఒంగోలు వన్‌టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య బోధించేందుకు రాజీవ్ విద్యా మిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి జూలై 31వ తేది వరకు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా విద్యార్థుల్లో మాతృభాష(తెలుగు), గణితంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.
బడి ఈడు బాలబాలికలందరినీ పాఠశాలలకు ఆకర్షించేలా స్కూళ్లను సిద్ధం చేయాలని చెప్పారు. పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు చివరి తరగతి వరకు కొనసాగేలా కృషి చేయాలన్నారు. నాలుగు భాషా నైపుణ్యాలు(వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం), గణితంలో చతుర్విద ప్రక్రియల(కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో ఉదయం పూట సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తెలుగు, గణితంలో కనీసం ఏ లేదా బీ గ్రేడు సాధించేలా తీర్చిదిద్దాలని చెప్పారు. విద్యార్థులతో రోజూ హోమ్ వర్క్ చేయించడంతో పాటు క్రమశిక్షణను పెంపొందించాలన్నారు.
పాఠశాల, తరగతి సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లా, మండలస్థాయిల్లో మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రాజెక్టు అధికారులను ఉషారాణి ఆదేశించారు. జిల్లా స్థాయిలో డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉప విద్యాధికారులు, రాజీవ్ విద్యామిషన్ ఏఎంఓలు, ఏఏఎంఓలు, డీఆర్పీలు, జిల్లా స్థాయి మానిటరింగ్ టీం సభ్యులతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎమ్మార్పీలు, సీఆర్పీలతో కమిటీలు వేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయి బృందాలు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయని తెలిపారు.
సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించండి
జిల్లాలో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఎంఈఓలు, హెచ్ఎంలను రాజీవ్ విద్యామిషన్ పీడీ వీ శ్రీనివాసరావు ఆదేశించారు. పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలుకు సంబంధించి గత ఏడాది సరఫరా చేసిన మాడ్యూల్స్‌నే ఉపయోగించాలని చెప్పారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్ధుల కోసం వేసవి సెలవుల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల కోసం పంపిణీ చేసిన వర్క్‌బుక్‌లను ప్రతి పాఠశాలకు ఒకటి చొప్పున సరఫరా చేసి అందులోని అంశాలను విద్యార్థులకు వివరించాలని పీడీ శ్రీనివాసరావు సూచించారు.