భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం అభివృద్ధికి రూ. 100 కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక బీఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులను అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామని అన్నారు. గోదావరిపై రెండో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.350 కోట్లు మంజూరు చేసిందని, ఈ వివరాలు త్వరలో తెలుపుతామని అన్నారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ పొడగించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు.
భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచేలా పోరాడి గెలిచామని అన్నారు. అనంతరం భద్రాచలంను తెలంగాణలో కొనసాగించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేసిన పాత్రికేయులను ఆయన సన్మానించారు. తొలుత భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జ్ఞాపికను, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఓ వీరపాండియన్, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, పీఆర్వో సాయిబాబా, గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, పట్ణణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, భోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు పాల్గొన్నారు.