కోటి తలంబ్రాల మాసూలులో ‘రామ దండు’!
రాజానగరం: ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో నూతనపద్ధతులు అవలంబించే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు శుక్రవారం మరో వైవిధ్యమైన పని తలపెట్టారు. ఏటా భద్రాద్రి రాముని కల్యాణోత్సవానికి ఈ ప్రాంతం నుంచి ధాన్యాన్ని గోటితో ఒలిచి, కోటి తలంబ్రాలను సమర్పించడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన ధాన్యాన్ని సేకరించడం కాక తానే పండిస్తే బాగుంటుందనే ఆలోచనతో కోరుకొండ-గోకవరం మండలాల మధ్య కొంత పొల ంలో ఈ ఏడాది వరి సాగు చేశారు.
కోతకు వచ్చిన ఆ పంట నుంచి కొన్ని కంకులను కోసి కుచ్చుగా కట్టి, ఇటీవల అటుగా వచ్చిన తిరుమలేశుని రథయాత్రకు కానుకగా అందజేశారు. కాగా, శుక్రవారం పంటను కోయించడానికి రామదండునే వినియోగించారు. కూలీలే హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు తదితర వేషాలు వేసి, శ్రీరామ నామాన్ని జపిస్తూ పైరు కోసి, పనలను బల్లకేసి కొట్టి, నూర్పిడి పూర్తిచేశారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆవాహ పూజ, హనుమాన్ చాలీసా, శ్రీరామ అష్టోత్తర, సహస్రనామ స్తోత్రం, సుందరకాండ పారాయణం చేశారు. ఈ ధాన్యాన్ని ఎప్పటిలాగే కోరుకొండ, రాజానగరం, మండపేట తదితర ప్రాంతాల్లోని భక్తులకిచ్చి, గోటితో ఒలిపించి కోటి తలంబ్రాలను భద్రాద్రి రామునికి సమర్పిస్తామని కల్యాణం చెప్పారు.