జెన్కోపై క్రిమినల్ చర్యలు
పర్యావరణ అనుమతి లేకుండా ‘భద్రాద్రి’ నిర్మాణంపై ఎన్జీటీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : పర్యావరణ అనుమతి లేకుండా ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పీసీబీని ఆదేశించింది. వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్‌లతో పాటు పర్యావరణ చట్టం-1989 సెక్షన్లు 15, 16, 17 కింద 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి విద్యుత్ కేంద్ర పనులు ప్రారంభించడంపై అభ్యంతరం తెలుపుతూ హ్యూమన్‌రైట్స్ ఫోరం (హెచ్ఆర్ఎఫ్) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న ఎన్జీటీ ఈ మేరకు తీర్పునిచ్చింది.
బాధ్యులైన అధికారులపై ఇంతవరకు పీసీబీ (రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి) చర్యలు తీసుకోకపోవడం తమకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించిందని తీర్పులో ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పర్యావరణ చట్ట ఉల్లంఘనల విషయంలో జెన్కో నిర్వహణాధికారు (ఎగ్జిక్యూటివ్)లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు జారీ చేసేవరకు ప్రాజెక్టు నిర్మాణ పనులపై జెన్కో యథాతథా స్థితిని కొనసాగించాలని పేర్కొంది. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను ధ్వంసం చేసేందుకు ఆదేశించాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని ఎన్జీటీ తోసిపుచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావంపై సరైన అధ్యయనం సాధ్యమా? కాదా? అన్న అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒక వేళ జెన్కోకు వ్యతిరేకంగా ఈఏసీ నిర్ణయం వెలువడితే కేంద్ర పర్యావరణ శాఖ సరైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. పర్యావరణ అనుమతిపై 8 వారాల్లో నిర్ణయాన్ని తీసుకోవాలని గడువు విధించింది.