భూమిని ఆక్రమించారని కలుపు మందు తాగాడు
కారేపల్లి: తన భూమిని అన్యాయంగా ఆక్రమించి ట్రాక్టర్లతో దున్నుతున్నారంటూ ఓ రైతు కలుపు మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేశాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన పచ్చిపాల భద్రయ్య, ఆయన సోదరులు సోమయ్య, రామయ్య, మల్లయ్యకు ఆలియాతండాలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో భద్రయ్య మినహా మిగతా వారు ఆర్టీఐ మాజీ కమిషనర్ జి.శంకర్‌నాయక్‌కు భూమి అమ్ముకు న్నట్లు సమాచారం. అయితే, సర్వేనంబర్ 548లోని తన 1.20 ఎకరాల భూమిని శంకర్‌నాయక్ తప్పుడు పత్రాలతో బై నంబర్లు సృష్టించి పట్టా చేసుకున్నారని భద్రయ్య కొన్నే ళ్లుగా ఆరోపిస్తున్నాడు. మరోపక్క శంకర్‌నాయక్ తాను చట్ట ప్రకారమే భూమి కొన్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇరు వర్గాలు తహసీల్దార్ మొదలు ఉన్నతాధికారుల వరకు ఫిర్యా దు చేసుకున్నారు. భద్రయ్య కోర్టును సైతం ఆశ్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం శంకర్‌నాయక్ మను షులు ట్రాక్టర్లతో వివాదాస్పద భూమిని దున్నసాగారు. దీంతో రైతు భద్రయ్య, ఆయన భార్య భాగ్యమ్మ అడ్డుకున్నారు. ట్రాక్టర్ కదలకుండా భద్రయ్య అడ్డుగా పడుకోవడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కలుపు మందు తాగి అస్వస్థత కు గురయ్యాడు. ఆయనను తొలుత ఇల్లెందుకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆలియాతండాకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. ఇదే జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల భూవివాదంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు మరో రైతు ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశమైంది. తాజా ఘటనలో భద్ర య్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై రాజారాం తెలిపారు. భద్రయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.