నేడు బీబీనగర్, బొమ్మలరామానికి భగీరథ నీళ్లు
భువనగిరి : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వానా శనివారం నుంచి నల్లా నీటిని సరఫరా చేయనున్నట్లు వాటర్‌గ్రిడ్ డీఈ లక్ష్మణ్ తెలిపారు. తొలివిడుతలో షామీర్పేట నుంచి భువనగరి, ఆలేరు నియోజకవర్గంలోని బీబీనగర్, బొమ్మలరామారం గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయడానికి అన్ని చర్యలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇటీవల బీబీనగర్‌లో ట్రయల్‌రన్‌లో భాగంగా నీటిని విడుదల చేశారన్నారు. బీబీనగర్ మండలం భట్టుగూడెం వద్ద మూసీ నీటి వరదలో పైపులను తాత్కాలికంగా వేశామన్నారు. భట్టుగూడెం, పెద్దరావులపల్లి మధ్యన బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదన ఉన్నందున అప్పటి వరకు తాత్కాలిక పైపులు వేసినట్లు తెలిపారు. మూసీకి వరద పోటెత్తడంతో పైపుల కోసం నిర్మించిన దిమ్మెలు కొట్టుకుపోయాయని, వాటిని తిరిగి పునర్నించినట్లు చెప్పారు. అయితే వరద తాకిడికి పైపులు ఉండడం లేదని, పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.