విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం !
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్ 11న జరిగిన మైసూర్–దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్లు లేకపోవడం, పట్టాలను ఎవరో బలవంతంగా అపసవ్య దిశలోకి సుత్తితో కొట్టిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెల్సిందే. సవ్యదిశలో నేరుగా వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి హఠాత్తుగా వచ్చి ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో రైల్వే సిగ్నల్, టెలికం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ బృందం ఆదివారం కవరపేట స్టేషన్లోని ఘటనాస్థలిలో దర్యాప్తు మొదలెట్టింది. ‘‘రైల్వేపట్టాల ఇంటర్లాకింగ్ వ్యవస్థలోని భాగాలను విడదీశారు. వీటి గురించి బాగా అవగాహన ఉన్న ఆగంతకులే ఈ పని చేశారు. ఇటీవల కవరపేట స్టేషన్ సమీపంలో ఇలాంటి దుశ్చర్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ మాత్రం సఫలమయ్యారు. ఘటన జరగడానికి నాలుగు నిమిషాల ముందే ఇదే పట్టాల మీదుగా ఒక రైలు వెళ్లింది. అది వెళ్లి మైసూర్–దర్భంగా రైలువచ్చేలోపే బోల్ట్లు, విడిభాగాలు విడతీశారు’’ అని అధికారులు వెల్లడించారు.