అవకాశం వస్తే..తెలుగులో పాడుతా..
భజన్ బాద్షా అనగానే ప్రతి సంగీత ప్రియుడికి గుర్తొచ్చే పేరు అనూప్ జలోటా! హార్మోనియం వాయిస్తూ.. చిరుదరహాసంతో మనసులోని సంగీతాన్ని పెదవులమీద ఆడిస్తూ.. మధ్యమధ్యలో ఛలోక్తులు విసురుతూ తనదైన శైలిలో పాటల ప్రేమికులను ఆకట్టుకుంటారు.‘హైడోరైట్’ నిర్వహిస్తున్న ‘హండ్రెడ్ డే హైడోరైట్ సీజన్ 3 ఫెస్టివల్’కి ఈ శనివారం అతిథిగావిచ్చేశారు పద్మశ్రీ అనూప్ జలోటా. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ఆయన జరిపిన మాటామంతీ..
హైదరాబాద్ ఆడియన్స్ భజన్స్ను ఎంత ఇష్టపడతారో.. గజల్స్నీ అంతే ప్రేమిస్తారు. ఉర్దూ, హిందీ భాషలనెంతగా అభిమానిస్తారో.. సంగీతాన్ని అంతే ఇదిగా ఆరాధిస్తారు. తరాలు మారినా ఈ అభిరుచి మాత్రం మారలేదు. ఇక్కడి తెహజీబ్, కల్చర్ దేశంలో ఇంకెక్కడా కనిపించదు. మాలాంటి కళాకారులను ఇన్స్పైర్ చేసేది ఇలాంటి కళాకారులే!
సంగీతానుబంధం..
హైదరాబాద్‌తో నాది సంగీతానుబంధం. నా ఆత్మీయ స్నేహితుడు తలత్అజీజ్ (సానియామీర్జా మేనమామ)ది హైదరాబాదే, నా గురువు సమానులు విఠలరావుదీ హైదరాబాదే, నా శిష్యులు శరత్గుప్తా, మంజ్రేకర్లదీ హైదరాబాదే. ఇక్కడ రవీంద్రభారతీ, చౌమొహల్లా ప్యాలెస్ వంటి ఎన్నో అద్భుతమైన కచేరీవేదికలున్నాయి. నేనిక్కడ యాభై కచేరీలు ఇచ్చుంటాను. నేనిక్కడికి ఎప్పుడు వచ్చినా నా పాట వినడానికి విఠల్‌రావు లాంటి సీనియర్స్ వస్తారు. ఐదారేళ్ల కిందట హైదరాబాద్‌లో పండిత్ మోతీరాం జ్ఞాపకార్థం ఓ సంగీత కార్యక్రమం జరిగింది.
దాంట్లో నేనూ పాల్గొన్నాను. పండిట్ జస్రాజ్ వచ్చారు. ‘ కేవట్ కభీ కభీ భగవాన్కోభీ..’భజన్ పాడుతుంటే పండిట్ జస్రాజ్ ఏడ్చేశారు. వెంటనే వేదికమీదకు వచ్చి తన మెడలో ఉన్న మంచిముత్యాల హారం తీసి నా మెడలో వేసేశారు. ఆ హారం అతనికి ఓ రాజుగారు ఇచ్చిన కానుకట. ఇంతటి సత్కారాన్ని నాకందించింది హైదరాబాదే. నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం. ఇప్పటిదాకా హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ మొదలు మలయాళీ వంటి తొమ్మిది భాషల్లో పాడాను. తెలుగుభాష ఎంతో తీయనైంది. తెలుగులోనూ మంచి గజల్స్, భజన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో చిన్న అవకాశం వచ్చినా తెలుగులో పాడతాను.
దిల్సే..
మా నాన్న (పురుషోత్తమ్‌దాస్ జలోటా) మంచి సంగీతవిద్వాంసుడు. నాకు శాస్త్రీయసంగీతం, భజన్స్ నేర్పింది ఆయనే. ఇక సినిమా మ్యూజిక్కు వస్తే.. సినీ సంగీతానిది అల్పాయుష్షు. ఇది కేవలం బీట్తో పరిచయమవుతున్నదే తప్ప సాహిత్యంతో కాదు. సాహిత్యంతో అలరారే సంగీతమే చిరాయువును నింపుకుంటుంది. నేనెప్పుడు అలాంటి పాటల కోసమే ఆరాటపడుతుంటాను. నేనే కాదు తలత్ అజీజ్, పంకజ్ ఉదాస్, జగజిత్ సింగ్.. మా అందరికీ సాహిత్యమే ముఖ్యం. నా కెరీర్ తొలినాళ్లలో పాడిన ‘ఐసీ లాగీ లగన్’ భజన్ ఇప్పటికీ అంతే పాపులర్. కారణం సాహిత్యం. అందుకే మా తరంలో చాలామంది సంగీతకారులు సినిమాల్లో పాడినా నేను అటువైపు వెళ్లలేదు.
భజన్స్, గజల్స్ పాడేటప్పుడు నాటకీయత, డ్రామాకు తావుండదు. గొంతునుంచి కాక హృదయం నుంచి వస్తుంది. దిల్ సే.. వస్తుంది. ఏ కళ అయినా ఒక యోగం. అందులో భారతీయ సంగీతం మహాద్భుతమైనది. మనసును ఉల్లాసపరచడమే కాదు ఏకాగ్రతనూ పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతనకు ఇదీ ఓ సాధనం. ఇలాంటి కళల సాధనకు షార్ట్‌కట్స్ ఉండవు. నెవర్ ట్రై ఫర్ షార్ట్ కట్స్. అవి షార్ట్‌సర్క్యూట్స్. అభ్యాసన అనే పొడవైన దారి ఒకటే ఉంటుంది. ఆ దారి ఎన్నో విషయాలను నేర్పుతుంది.
..:: శరాది