విజిలెన్స్ దాడులు
కొండపి, న్యూస్‌లైన్: రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఐ. భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు ముందుగా కొండపిలోని 28వ నంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. మిడ్డే మీల్స్‌కు సంబంధించిన ఇన్‌వార్డ్సు, అవుట్‌వార్డ్సు రిజిస్టర్లు లేవు. స్టాక్ కంటే 742 కేజీల బియ్యం ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1వ నంబర్ దుకాణంలో మిడ్‌డేమీల్స్‌కు చెందిన 146 కేజీల బియ్యాన్ని రికార్డులో చూపించలేదు. 6ఏ కేసు నమోదు చేశారు. నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణాలను మండలస్థాయి అధికారులు నిత్యం తనిఖీ చేయాలని చెప్పారు.
డీలర్లు సమయపాలన పాటించి.. మెరుగైన సేవలు అందించాలన్నారు. బిల్లులు లేకుండా మధ్యాహ్న భోజన బియ్యాన్ని డీలర్లకు తరలిస్తున్న గోడౌన్ డీటీపై జేసీకి లిఖిత పూర్వక ఫిర్యాదు అందించనున్నట్లు తెలిపారు. దాడుల్లో దర్శి ఈడీటీ, సింగరాయకొండ ఈడీటీ బ్రహ్మయ్య, యేసుదాసు ఆర్ఐ డేవిడ్‌రాజ్ పాల్గొన్నారు. కాగా అధికారుల దాడులతో డీలర్లు చెమటలు పోస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు గాను వినియోగదారులకు సరిగా రేషన్ అందించలేదు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని గాభరా పడుతున్నారు. అధికారులు నేరుగా కార్డుదారుల వద్దకు వచ్చి రేషన్ అందుతున్నాయా లేదా.. అని సమాచారం అడుగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ బాధలు తొలగాలని ఆకాంక్షిస్తున్నారు.
కనిగిరిలో..
కనిగిరి,న్యూస్‌లైన్: మార్కాపురానికి చెందిన విజిలెన్స్ అధికారులు రెండు రేషన్ దుకాణాలు, రెండు బియ్యం దుకాణాలను తనిఖీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టినట్లు సహాయ సరఫరా అధికారి ఆర్. కోటయ్య తెలిపారు. కనిగిరి, పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో 10 రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీరి వెంట ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఎ. వేణుగోపాల్, ఎఫ్ఐ ఎస్. చంద్రశేఖర్ ఉన్నారు. అధికారుల రాక ముందుగానే పసిగట్టిన చాలామంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేశారు.