'వందకోట్లతో నీవు... వంద కేసులున్నా నేను'
కరీంనగర్ : పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌పై టీఆర్ఎస్ తరపున పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి వివేక్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరారని ఆయన శనివారమిక్కడ మండిపడ్డారు. 'వందకోట్లతో నీవు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే... ఉద్యమంలో వంద కేసులున్నా నేను బరిలోకి దిగుతున్నా' అని సుమన్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా మూడేళ్ల ముందే తెలంగాణను ప్రకటిస్తే 1200మంది విద్యార్థుల ప్రాణాలు దక్కేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై వందల కేసులుంటే....వివేక్ వందల కోట్లకు పడగలెత్తిన వారని సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ది కౌరవ సైన్యం...మాది పాండవ సైన్యం, సెంటు వాసనతో వాళ్లు... చెమట వాసనతో మేము, ధనబలం వాళ్లది...జన బలం మాది అని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన ఘటన టీఆర్ఎస్దైతే... తామే సాధించామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.