పరిపూర్ణానందను కలసిన సీఎం దంపతులు
వేములవాడ, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధిపై సూచనలివ్వాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానం దను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీ సమేతంగా కలిశారు. మంగళవారమిక్కడ భారత్ టుడే చానల్ కార్యాలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు గంటన్నరసేపు పరిపూర్ణానందతో పలు అంశాలపై సీఎం చర్చించారు. వేముల వాడ, కాళేశ్వరం ఆలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందు కు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, అందుకు తగిన సలహాలు సూచనలు అందించాలని పరిపూర్ణానందను సీఎం కోరినట్లు తెలిసింది.
ప్రభుత్వం తరఫున సీఎం వివిధ ఆలయాలకు తెలంగాణ మొక్కులు చెల్లించటాన్ని పరిపూర్ణానంద సమర్థించారు. దీనిపై వామపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. మొక్కుల చెల్లింపు న్యాయ సమ్మతమేనని తన అభిప్రాయాన్ని వినిపించారు. ఆ సమయంలో స్వామి మాటలు తనకు ఆత్మస్థైర్యం కల్గించిందని ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.