సింగరేణికి కొత్త డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. ప్రస్తుతం కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న బి.భాస్కరరావును అదే విభాగానికి, ఆడ్రియాల లాంగ్వాల్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.చంద్రశేఖర్‌ను సంస్థ ఆపరేషన్ విభాగం డైరెక్టర్‌గా నియమించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక కమిటీ మంగళవారం సచివాలయంలో 10 మంది సింగరేణి సీనియర్ అధికారులకు ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిని ఎంపిక చేసింది. కమిటీలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి, సింగరేణి సీఎండీ, కోల్ ఇండియా సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సీఎండీలు సభ్యులుగా వ్యవహరించారు. ప్రతిభ, నడవడిక అంశాల ఆధారంగా కొత్త డైరెక్టర్లుగా ఇద్దరికి పదోన్నతులు కల్పించినట్లు సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.