వేధింపులు తాళలేక వివాహిత మృతి
భట్లపాలిక (కె.గంగవరం) : ద్రాక్షారామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక వివాహిత మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుగుల మందు సేవించిందని అత్తింటివారు అంటుండగా అదనపు కట్నం కోసం తన కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మండలంలోని భట్లపాలిక శివారు మెరక పొలానికి చెందిన కాటే నాగేశ్వరావుతోదంగేరుకు చెందిన తోకల అన్నవరం, వెంకటరత్నంల కుమార్తె సులోచన (26)కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా భర్త నాగేశ్వరరావు మద్యానికి బానిసగా మారాడు. తరచూ మద్యం తాగి వచ్చి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేసేవాడు. సులోచన బావ సుబ్రహ్మణ్యం, అత్త ముత్యాలమ్మ ఇతర కుటుంబ సభ్యులు తన కూతురిని వేధింపులకు గురి చేసేవారని సులోచన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మూడు నెలల కిత్రం గొడవలు పడగా పెద్దల సమక్షంలో తిరిగి కాపురానికి పంపినట్టు వారు చెబుతున్నారు. అత్తవారింటి వద్ద ఉన్న సులోచ నను వివాహ సమయంలో ఇచ్చిన రూ.80 వేలు కాకుండా మరింత కట్నం తీసుకురావాలని శనివారం ఉదయం విచక్షణా రహితంగా వేధింపులకు గురిచేయటంతో సులోచన అపస్మారక స్థితికి చేరుకుందని వారు చెబుతున్నారు. కొన ఊపిరితో ద్రాక్షారామలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారని, ఎవరికీ అనుమానం లేకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి తమకు సమాచారం అందించారన్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లేలోపు భర్త నాగేశ్వరరావు పరారయ్యాడని తల్లిదండ్రులు, అన్నవరం, వెంకటరత్నం, ఇతర బంధువులు ఆరోపిస్తూ కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురం సీఐ కాశీవిశ్వనాథ్, కె.గంగవరం ఎస్సై పెద్దిరాజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.