‘భవిత గోల్డ్’ కుచ్చుటోపీ
భీమవరం అర్బన్ : అధిక వడ్డీలు ఇస్తామని ప్రకటనలు గుప్పించి డిపాజిట్ల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసిన భవిత గోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులు, ఏజెంట్లు శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంకు చెందిన గోలి శ్రీనివాస్ ఈ సంస్థ పేరిట ఖాతాదారుల నుంచి రూ.80 లక్షలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టినట్టు బాధితులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలి శ్రీనివాస్ స్థానిక రెస్ట్‌హౌస్ రోడ్డులోని ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ ఎదుట 2012 మే నెలలో భవిత గోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ లిమిటెడ్ పేరిట కార్యాలయూన్ని ఏర్పాటు చేశారు.
విజయవాడలో ప్రధాన కార్యాలయం ఉందని, ఏలూరు, రాజమండ్రి, మలికిపురంలలో బ్రాంచిలు ఏర్పాటు చేసినట్టు ప్రకటనలు ఇచ్చారు. తమ సంస్థలో డిపాజిట్లు చేయిస్తే ఎక్కువ కమీషన్ ఇస్తామని భీమవరంలో సుమారు 80 మందిని ఏజెంట్లుగా నియమించారు. ఏడాదిలోనే ఇక్కడ రూ.80 లక్షలను డిపాజిట్లుగా సేకరించారని బాధితులు చెబుతున్నారు. విజయవాడలో కార్పొరేట్ హం గులతో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఆ సంస్థ వలలో చిక్కుకున్నామని ఏజెంట్లు చెప్పారు. విజయవాడ, భీమవరంతోపాటు ఏలూరు, రాజమండ్రి, మల్కిపురంలలో సుమారు రూ.2 కోట్ల వరకూ డిపాజిట్లు సేకరించారని తెలిపారు. డిపాజిట్ల మెచ్యూరిటీ గడువు పూర్తికావడంతో ఆ మొత్తాలను తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగామని,
సంస్థ సిబ్బంది సొమ్ము ఇవ్వకుండా వాయిదాలు వేయడంతో ఇటీవల సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగామని పలువురు ఖాతాదారులు చెప్పారు. సంస్థ యజమాని గోలి శ్రీనివాసరావు వచ్చి త్వరలోనే సొమ్ము ఇస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించామన్నారు. ఆ తరువాత పంగిడిగూడెంలో ఉంటున్న అతని వద్దకు వెళ్లగా ఏలూరులోని కార్యాలయూనికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పారన్నారు. అక్కడకు వెళ్లగా మీరెవరో నాకు తెలియదని, ఏంచేసుకుంటారో చేసుకోండని చెప్పారని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించామని వివరిం చారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, డిపాజిట్ సొమ్ములు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరారు.
నమ్మించి నట్టేట ముంచారు
అధిక వడ్డీ ఇస్తామని మమ్మల్ని నట్టేట ముంచారు. ఏడాదిలో రూ.18 వేలు కడితే వడ్డీతో కలిపి రూ.19,500 ఇస్తానని చెప్పారు. ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రి ఖర్చులకైనా డబ్బు ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదు. పోలీసులే మాకు న్యాయం జరిగేలా చూడాలి.
- తోట శ్రీను, డిపాజిట్‌దారుడు
ఖాతాదారులకు ఏం చెప్పాలి
సరైన ఉద్యోగం లేక ఆ సంస్థలో ఏజెంట్‌గా చేరాను. వందకు పైగా ఖాతాదారులతో డిపాజిట్లు కట్టించాను. ఇప్పుడు సంస్థను మూసివేశారు. ఇప్పటివరకు నేను చేర్పించిన ఖాతాదారులకు సంస్థ రూ.15 లక్షలు ఇవ్వాలి. వాళ్లంతా నా ఇంటికి వచ్చి అడుగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. - ఎంకే పాషా, ఏజెంట్