మోడీ సర్కార్...మొండిచెయ్యే!
జిల్లా ప్రజల ఆశలు నీరుగారిపోయా యి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తొలిసారిగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, బడ్జెట్ రైలు జిల్లాలో ఆగకుండానే వెళ్లిపోయింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులనూ పట్టించుకోలేదు. బీబీనగర్-నల్లపాడ్ డబ్లింగ్, విద్యుదీకరణ, నల్లగొండ-మాచర్ల, సూర్యాపేట-డోర్నకల్ రైల్వేలైన్, భువనగిరి-కాజీపేట మూడోలైన్ నిర్మాణం, ఎంఎంటీఎస్ పొడిగింపుతో పాటు గత ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి మరో కొత్త రైల్ ప్రకటించినప్పటికీ అది జిల్లాలోని ఏ స్టేషన్లో ఆగని పరిస్థితి.. దీంతో రైల్వే ప్రయాణికుల ఆశలు మరికొంత కాలం వాయిదా పడ్డాయి.
‘హామీ’తో సరి..
నల్లగొండ : కేంద్ర రైల్వే బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చింది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎంతోకొంత నిధుల కేటాయింపు జరిగేది. అలాం టిది ఈ ఏడాది బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపారు. గత ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన నల్లగొండ-మాచర్ల ప్రాజెక్టు(92కి.మీ)కు బడ్జెట్లో నయాపైసా విదల్చలేదు. నల్లగొండ రైల్వే స్టేషన్లో అవుట్ పే షెంట్ విభాగం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తావన లేకుండా పో యింది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందు కు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమం లో పూర్తి చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు, జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేయాల్సి వస్తే జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాగా చెన్నై-హైదరాబాద్ మీదుగా కొత్త సెమీ బుల్లెట్ రైలును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు తప్పా జిల్లా ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు.
‘పేట’కు మళ్లీ నిరాశే..
సూర్యాపేట : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సూర్యాపేట రైల్వే లైన్‌కు ఈసారి బడ్జెట్లో కూడా మోక్షం లభించలేదు. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూర్యాపేట ప్రస్తావనే లేదు. జిల్లాలో ప్రముఖ పట్టణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పేటకు రైల్వే లైన్ వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రతి ఏటా నిరాశే ఎదురవుతోంది. కనీసం 2013 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన సూ ర్యాపేట-డోర్నకల్ రైల్వే లైన్‌కు నిధులు కేటాయిస్తారనుకున్నా.. ఆ కల నెరవేరలేదు.
‘మేళ్లచెర్వు-జగ్గయ్యపేట’కు రూ.60కోట్లు
మిర్యాలగూడ : రైల్వే బడ్జెట్లో మిర్యాలగూడకు స్థానం దక్కలేదు. కానీ మేళ్లచెర్వు- జగ్గయ్యపేట రైల్వే లైన్‌కు రూ.60 కోట్లు, నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ సర్వే కోసం రూ.5 కోట్లను కేటాయించారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా గుర్తించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రతిఏడు అలాగే ఈసారి కూడా అన్యాయం జరిగిందంటూ మిర్యాలగూడ ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రతిపాదనలు బుట్టదాఖలు
భువనగిరి : జిల్లా ప్రజలకు రైల్వే బడ్జెట్లో కనీస ప్రాతినిద్యం లభించలేదు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దక్షిణ మధ్యరైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు ఇరవై కిలోమిటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా ప్రజలందరికీ రైలు ప్రయాణం అందని దాక్షలాగానే మిగిలింది. వందలాది రైళ్లు తమ గ్రామాల గుండా వెళ్తున్నా వాటిలో ప్రయాణించే వీలు లేక బస్‌లు, ఇతర వాహనాలపైనే 90 శాతం ప్రజలు ఆధారపడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లా ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతాయనుకున్న ఎంఎంటీఎస్ రైలు పొడిగింపు, సికింద్రాబాద్-భువనగిరి మూడో రైల్వే లైన్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. బీబీనగర్-నడికుడి మార్గంలో డ బ్లింగ్, విద్యుదీకరణ పనులకు కూడా మోక్షం లభించలేదు. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి మరో కొత్త రైలును ప్రకటించినప్పటికీ అది జిల్లాలోని ఏ స్టేషన్లో ఆగదు. తద్వారా జిల్లా ప్రయాణికులకు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదు.