సూక్ష్మంలో మోక్షాన్నిచ్చే శివాలయాల సందర్శన
రాజమహేంద్రవరం కల్చరల్ :
ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి నలుదెశలా ఉన్నా 108 శివాలయాలు జాతక విభాగంలో చెప్పిన 27 నక్షత్రాలకు కలిపి ఉండే 108 పాదాలకు ప్రతీకలని, ఆయా నక్షత్ర జాతకులు వీటిల్లో తమకు అనుకూలమైన ఆలయాన్ని సందర్శించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని శ్రీ మహాలక్ష్మి సమేత చిన్నవేంకన్నబాబుస్వామివారి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు అన్నారు. తొంభై గంటల్లో చేయాలనుకున్న భీమసభ సందర్శన యాత్ర ను, 72 గంటల్లో ముగించుకుని గురువారం సాయంత్రం నగరానికి వచ్చిన ఆయనకు పుష్కరాల రేవు వద్ద శిషు్యలు ఘనస్వాగతం పలికారు. ముందుగా పుష్కరాల రేవులోని గోదావరి మాత విగ్రహానికి, తరువాత గోదావరి నదీమతల్లికి ఆయన హారతులు ఇచ్చారు. శిషు్యలనుద్దేశించి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ, జ్యోతిషరంగంలో కృషి చేస్తున్నవారు ఈ ఆలయాలను తప్పక దర్శించగలిగితే, వారి మాటకు ప్రామాణికత లభిస్తుందని అన్నారు. ద్రాక్షారామ క్షేత్రానికి నాలుగు దిక్కులా ఉన్న 108 ఆలయాల్లో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయని, కొన్నిచోట్ల సుశిక్షితులయిన అర్చకులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి మూలస్తంభాలైన ఆలయాలను పరిరక్షించుకోవడం మన బాధ్యతని చెప్పారు.