తాచుపామైనా తలొంచాల్సిందే!
టి.నరసాపురం : కోడె తాచైనా , గోధుమ తాచైనా ఏ పామైనా టి.నరసాపురానికి చెందిన చిన్నం భీమయ్య ముందు తలవంచాల్సిందే. ఏ జాతి పామైనా జనసంచారానికి ఇబ్బందులు కలిగిస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకు గుర్తొచ్చే వ్యక్తి భీమయ్య. ఇళ్లల్లోకి వచ్చిన పామును అతి సునాయాసంగా పట్టుకుంటాడు. సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి వదిలివేస్తాడు. మండలంలో గండిగూడెం గ్రామంలో బడుగు పాశయ్య ఇంట్లోకి 7 అడుగుల పొడవైన గోధుమ తాచు రావడంతో ఆదివారం భీమయ్య దానిని పట్టుకుని బందంచర్ల అడవిలో వదిలివేశాడు. భీమయ్య 15 సంవత్సరాల క్రితం ఏలూరు సమీపంలోని పోణంగికి కూలి నిమిత్తం వెళ్లిన సందర్భంలో అక్కడ కారెం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వద్ద పాములను ఒడిసి పట్టుకోవడంలో నెలరోజులు శిక్షణ తీసుకున్నాడు. నాటి నుంచి టి.నరసాపురం, లింగపాలెం, కామవరపుకోట, చింతలపూడి మండలాల్లోనే కాకుండా ఏలూరు ప్రాంతంలోను ఇళ్లల్లోకి పాము వచ్చిన సందర్భాల్లో భీమయ్య వాటిని పట్టుకుంటాడు. గత 15 ఏళ్లలో దాదాపు 1,000 పాములను పట్టుకుని అడవిలో వదిలివేసినట్టు భీమయ్య తెలిపాడు.