రెండో రోజుకు చేరిన లారీ యజమానుల ధర్నా
భూపాలపల్లి, న్యూస్‌లైన్ :
భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి అయ్యే బీ గ్రేడ్ బొగ్గును తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని లారీ యజమానులు కేటీకే 5వ గని ప్రధాన రహదారి వద్ద చేపట్టిన మహా ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లారీ యజమానులు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈ, ఎఫ్ గ్రేడ్ బొగ్గుతోపాటు గణపురం మండలంలోని కేటీపీపీ, బీ గ్రేడ్ బొగ్గును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు తమకే అందించాలని కోరా రు. ఇదిలా ఉండగా, భూపాలపల్లి ఏరియా జీఎం నాగభూషణరెడ్డి ధర్నా శిబిరానికి చేరుకుని లారీ యజమానులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ప్రస్తుతం ధర్నాను విరమించాలని ఆయన లారీ యజమానులను కోరారు. అయితే ఏరియాలో ఉత్పత్తి అయ్యే బీ గ్రేడ్ బొగ్గు మొత్తాన్ని తమకే అప్పగిస్తామని హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని యజమానులు చెప్పారు. దీంతో చేసేది ఏమిలేక జీఎం అక్కడి నుంచి వెనుదిరిగారు.
ధర్నాలో లారీ, టిప్పర్, కోల్ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు నూకల నర్సింహరెడ్డి, పులి వేణుగోపాల్‌గౌడ్, కంకణాల రవీందర్‌రెడ్డి, రాములు, శ్రీరాములు, సేనాపతి, దశరథం, అశోక్ పాల్గొన్నారు. కాగా, లారీ యజమానుల ధర్నాకు టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణరావు, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీ యజమానుల న్యాయమైన కోర్కెలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ధర్నాకు కాకతీయఖని ఓపెన్‌కాస్ట్ హమాలీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు జోగుల రాజు, ప్రభాకర్, శంకర్, రాజయ్య మద్దతు తెలిపారు.
టీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో...
ఏరియాలో ఉత్పత్తి అయ్యే బీ గ్రేడ్ బొగ్గును తమకే అప్పగించాలని కోరుతూ లారీ యజమానులు చేపట్టిన ధర్నాకు మద్దతు పలుకుతూ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వ ద్ద రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో నాయకు లు పైడిపెల్లి రమేష్, థమ్సప్ రాంగోపాల్‌రావు, తా టి వెంకన్న, బోయిని వెంకటస్వామి, బాబర్‌పాషా, గూళ్ల కనకయ్య పాల్గొన్నారు.