నన్ను తప్పించండి: వెంగమ్మ
తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలంటూ డాక్టర్ భూమావెంగమ్మ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు ఆమె వినతి పత్రం అందజేశారు. కొన్ని నెలలుగా స్విమ్స్‌లో జరుగుతున్న పరిణామాలపై మనస్తాపం చెందినట్టు తెలిపారు. తమకు అనుకూలమైన వారిని డైరెక్టర్ పదవిలో ఉంచడానికి అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్టు ఆమె ఆవేదన చెందారు.
డెరైక్టర్, వైస్ చాన్సలర్ పదవులకు డాక్టర్ భూమావెంగమ్మ రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 నుంచి స్విమ్స్ డెరైక్టర్‌గా, వైస్‌చాన్సలర్‌గా వెంగమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో వ్యక్తిగత కారణాలు చూపుతూ స్విమ్స్ డెరైక్టర్ పదవులకు నెల ముందుగానే రాజీనామా చేస్తున్నానని, దీనిని ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈనెల 20వ తేదీన రాజీనామా పత్రం అందించినట్టు తెలిసింది. అయితే ఆమె రాజీనామా విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.