భూపాలపల్లి నియోజకవర్గం గత చరిత్ర ఇదే..
భూపాలపల్లి నియోజకవర్గం
2009లో నియోజకవర్గ పునర్ విభజనలో శాయంపేట నియోజకవర్గం రద్దై భూపాలపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.
భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి రెండోసారి గెలిచారు. స్పీకర్ పదవిలో ఉండి 2018లో పోటీచేసిన మదుసూదనాచారి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. గండ్ర వెంకట రమణారెడ్డి తన సమీప స్వతంత్ర ప్రత్యర్ది గండ్ర సత్యనారాయణరావుపై 14729 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. వెంకటరమణారెడ్డికి 67309 ఓట్లు రాగా, సత్య నారాయణరావుకు 54187 ఓట్లు వచ్చాయి. సత్యనారాయణరావు టిఆర్ఎస్లో చేరినా, టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేయడంతో గండ్రకు గెలుపు సులువు అయిందని అనుకోవచ్చు.
టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మదు సూదనాచారికి 53567 ఓట్లు వచ్చాయి. 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో మధుసూదనాచారిని ఓడిస్తే, 2014లో మదుసూదనాచారి ఈయనను ఓడిరచారు. అనంతరం తెలంగాణ తొలి శాసనసభకు స్పీకర్ అయ్యే అవకాశం పొందారు. 1994లో టిడిపి తరపున గెలిచిన మధుసూదనాచారి కొంతకాలం ఎన్.టి.ఆర్. టిడిపిలో ఉన్నారు.
తదనంతరం ఆయన టిఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ 2014లో మళ్లీ ఎమ్మెల్యే కాగలిగారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న గండ్రను 7214 ఓట్ల తేడాతో చారి ఓడిరచారు. కాని 2018లో ఓటమి చెందారు. మధు సూదనా చారి 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. గండ్ర కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 2014లో బిజెపి-టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన జి.సత్యనారాయణకు 57530 ఓట్లు వచ్చాయి. భూపాలపల్లిలో రెండుసార్లు రెడ్డి, మరోసారి బిసి నేత గెలుపొందారు.
శాయంపేట (2009లో రద్దు)
2004 వరకు ఉన్న శాయంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ఐ నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి, బిజెపి, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఇక్కడ రెండుసార్లు గెలిచిన సి.జంగారెడ్డి పరకాలలో ఒకసారి గెలుపొందారు. ఈయన హన్మకొండ లోక్సభ స్థానానికి పోటీచేసి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును ఓడిరచి సంచలనం సృష్టించారు.
ఇక్కడ రెండుసార్లు గెలిచిన మాదాటి నరసింహారెడ్డి నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. కొండా సురేఖ ఇక్కడ రెండుసార్లు, పరకాలలో ఒకసారి, వరంగల్ తూర్పు నుంచి ఒకసారి గెలిచారు. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా వున్నారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా కొంతకాలం ఉండి రాజీనామా చేశారు. 2009లో పరకాల నుంచి గెలిచారు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రబుత్వంపై వచ్చిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు.
ఆ తర్వాత 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో సురేఖ అనూహ్యంగా టిఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేసి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా గతంలో ఎన్నికయ్యారు. శాయంపేటలో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసి నేతలు గెలుపొందారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..