గుజరాత్లో పెట్టుబడులు పెట్టండి
రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు గుజరాత్ మంత్రి పిలుపు
హైదరాబాద్: తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని గుజరాత్ విద్య, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి భూపేంద్రసిన్హా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు గుజరాత్ ఎంతో అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నారు. వచ్చే జనవరి 11-13 తేదీల్లో గాంధీనగర్‌లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్-2015కు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సమ్మిట్‌పై రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు హైదరాబాద్‌కు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడుతూ ఒకప్పుడు విద్యుత్ కొరత ఎదుర్కొన్న గుజరాత్లో ఇప్పుడు అదనపు కరెంటు ఉందన్నారు. వ్యవసాయంలోనూ నూతన ఒరవడి సృష్టిస్తోందన్నారు.
2003లో వైబ్రెంట్ సమ్మిట్ మొదటిసారిగా ప్రారంభించామని... అప్పుడు రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. విద్యుత్, విద్య, ఆరోగ్యం, టూరిజం రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్‌లో ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, యూకే, యూఎస్ఏలు భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు.