మరింత చౌకగా చైనా ఉత్పత్తులు..!
బెంగళూరు : చైనా ఉత్పత్తులు ఇక మరింత చౌకగా వినియోగాదారులకు లభ్యంకానున్నాయి. భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ పేటైమ్, చౌకైన ధరలకు చైనా ఉత్పత్తులను భారత అమ్మకందారులకు అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో దోస్తి కట్టింది. దీంతో ఇప్పటికే చౌకగా లభ్యమయ్యే చైనా ఉత్పత్తులు మరింత చౌక కానున్నాయి. చౌకైన ధరలకే ఉత్పత్తులు అందించడంతో పాటు లాజిస్టిక్స్, చెల్లింపుల్లో సాయ పడనున్నట్టు పేటైమ్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టడానికి హోమ్, కిచెన్, మైక్రో ఇన్నోవేషన్, ఫ్యాషన్, మొబైల్ యాక్ససరీస్, వెస్ట్రన్ ప్యాషన్ కేటగిరీల్లో విశ్వసనీయమైన ట్రాక్ రికార్డున్న 25-30 భారత వ్యాపారులను గుర్తించామని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరి కల్లా కనీసం 10 వేల మంది వ్యాపారులకు ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంది.
50 లక్షలకు పైగా ఉత్పత్తులను చౌకైన ధరలకే చైనా నుంచి భారత వ్యాపారులకు అందించేందుకు దోహదపడతామని పేటైమ్ వెల్లడించింది. లాజిస్టిక్స్, పేమెంట్స్ తర్వాత వాణిజ్యంలో ఇన్వెంటరీ మూడో స్థబం లాంటిదని పేటైమ్ అధికారి భూషణ్ పాటిల్ తెలిపారు. దీనికోసం గిడ్డంగి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. బిజినెస్ టూ కన్సూమర్ కామర్స్ బిజినెస్ లపై ఎక్కువ శ్రద్ధ వహిస్తామని, అమ్మకందారుల సోర్స్ కు సమర్థవంతంగా సాయం చేస్తూ, మార్జిన్లు బాగా రాబట్టడానికి దోహదంచేస్తామని కంపెనీ స్పష్టంచేసింది.
డైరెక్ట్ కనెక్ట్ తో భారత చిన్నమధ్యతరహా కంపెనీల ఖర్చును మూడు రెట్టు తగ్గిస్తామని పాటిల్ చెప్పారు. చిన్నమధ్య తరహా కంపెనీలు చాలా డైరెక్ట్ గా సరుకు దిగుమతి చేసుకోవని, 2-3 దశల అనంతరం స్థానిక పంపిణీదారుల నుంచి సరుకును దిగుమతి చేసుకుంటాయని పేర్కొన్నారు. ఇన్ని దశలు లేకుండా డైరెక్టుగా ఉత్పత్తులను అమ్మకందారులకు అందిస్తామని చెప్పారు. ఖర్చును తగ్గించడానికి దిగుమతి హోస్ లతో టై-అప్ అవుతామని, తమ భాగస్వామ్యం సిటీబ్యాంకుతో విశ్వసనీయమైన చెల్లింపులు జరుపుతామని వెల్లడించారు.