భారత్ అభివృద్ధి చెందితే భూటన్ కు మేలు: మోడీ
భూటాన్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో భాగంగా ఆదేశ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భూటాన్ తమకు సన్నిహిత దేశమని, ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సామాన్యలు హక్కుల కోసం భూటాన్ రాజ కుటుంబం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కోరుకుంటుందని ఆయన తన ప్రసంగంలో తెలిపారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, భూటాన్ మధ్య సాంస్కృతిక బంధాలు ఉన్నాయన్నారు. రాబోయే దశకంలో ఇంధన భద్రత కీలకమైందన్నారు. భారత్‌లో ప్రభుత్వాలు మారినా భూటాన్‌లో సత్సంబంధాలు కొనసాగాయని మోడీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే భూటాన్‌కు మేలు జరుగుతుందన్నారు. బలమైన, స్థిరమైన ప్రభుత్వాలు ఉంటేనే పొరుగు దేశాలకు సాయం చేయగలమని మోడీ వ్యాఖ్యానించారు. తొలి పర్యటనలోనే భూటాన్‌కు రావటం ఆనందంగా ఉందన్నారు. కాగా భూటాన్ సుప్రీం కోర్టు భవనాన్ని నిన్న మోడీ ప్రారంభించారు.