నదుల అనుసంధానం కోసం సైకిల్ యాత్ర
► 2300 కిలోమీటర్ల యాత్ర చేపట్టిన వృద్ధుడు
మేడ్చల్:గంగా-కావేరి నదులను అనుసంధానం చేసి ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేయాలని కోరుతూ ఓ వృద్ధుడు సాహసోపేతమైన కార్యానికి శ్రీకారం చుట్టారు. నదుల అనుసంధానంకోసం వృద్ధాప్యంలోనూ దేశవ్యాప్తంగా సైకిల్యాత్రచేపట్టారు. రామేశ్వరం నుండి సైకిల్ యాత్రను ప్రారంభించిన కృష్ణన్(82)తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లా పెరియనాయబాలయమ్కు చెందిన వ్యక్తి. ఈయన సైకిల్ యాత్రలో భాగంగా గురువారం నాటికి 1500 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. గురువారం రాత్రి శామీర్‌పేట్ మండలం దేవరయాంజాల్‌కు చేరుకుని కృష్ణ సదనమ్ వృధ్ధాశ్రమంలో రాత్రి బస చేశారు.
ఈ సందర్భంగా కృష్ణన్ ‘సాక్షి’తో మాట్లాడారు. గంగా-కావేరి నదులను అనుసంధానం చేయడం ద్వారా నీటి సమస్యలు తీరడంతో పాటు సాగుకు నీరు పుష్కలంగా లభ్యమవుతాయన్నారు. ప్రతిరోజు 25 కిలోమీటర్లు సైకిల్‌పై యాత్ర చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో డిల్లీ నగరానికి చేరుకుంటుం దని వివరించారు.
అక్కడ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి ఈ నదుల అనుసంధానం వల్ల కలిగే లాభాలు, దాని ప్రాధాన్యతను వివరిస్తానని తెలిపారు. తాను యాత్రను రెండోసారి చేస్తున్నానని 2000 సంవత్సరంలో కూడా యాత్ర చేశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అనేక పనులు చేపడుతుంది కానీ గంగా-కావేరీ నదులను అనుసంధానం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.