నిరుపయోగంగా పీపీఈలు
- వృథాగా అగ్నిమాపక శాఖ జవాన్ల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్
- కొనుగోలు చేసినవి 2,320..
- ఉపయోగిస్తున్నవి 620
- శరీర ఆకృతికి తగ్గట్టు
- లేకపోవడం వల్లే ధరించడం లేదన్న సిబ్బంది
సాక్షి, ముంబై: అగ్నిమాపక శాఖ జవాన్ల రక్షణ కోసం కొనుగోలు చేసిన ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్మెంట్’ (పీపీఈ) లు కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోతున్నాయి. మంటలు ఆర్పివేసే ప్రయత్నంలో గాయపడకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన మొత్తం 2,320 పీపీఈలలో 620 మాత్రం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. మిగతావన్నీ ఆయా అగ్నిమాపక కేంద్రాలలో పనికిరాకుండా పడున్నాయి. సదరు యూనిఫాంలు జవాన్ల శరీర ఆకృతికి తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని ధరించడం లేదని తెలుస్తోంది. అయితే బాధ్యులైన సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు వారిని వెనకేసుకొస్తున్నారు.
వృథాగా యూనిఫాంలు..రూ. 20.67 కోట్ల నష్టం
అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పే ప్రయత్నంలో జవాన్లకు హాని జరగకుండా 2009లో బీఎంసీ పరిపాలనా విభాగం జాకెట్లు, ప్యాంట్లు, టీ షర్టులు, షూస్, హెల్మెట్లు, టార్చ్లైట్లు ఇలా ఒక్కో సెట్లో 15 వస్తువులు ఉండే 2,320 పీపీఈలు కొనుగోలు చేసింది. వీటిని మెసర్స్ టెక్నోట్రేడ్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా చైనా నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం బీఎంసీ పరిపాలన విభాగం రూ.29.34 కోట్లు చెల్లించింది. కానీ జవాన్ల శరీర కొలతల ప్రకారం వాటిని తయారు చేయకపోవడంతో ఫిర్యాదు చేశారు. సరిపోయిన 620 పీపీఈలు వినియోగిస్తున్నారు. మిగతావన్నీ వృథాగా పడి ఉండడంతో బీఎంసీకి వాటి ద్వారా రూ.20.67 కోట్ల నష్టం వాటిల్లింది. నిరూపయోగంగా ఉన్న యూనిఫాంలను మార్చి ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నిరాకరించారు.
మరోవైపు ఇచ్చిన గడువుకంటే రెండు నెలలు ఆలస్యంగా సామాగ్రి డెలివరీ చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా రూ.1.12 కోట్లు జరిమాన వసూలు చే యాల్సి ఉంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం స్థాయి సమితిలో ఈ అంశాన్ని చర్చించారు. దీనిపై ఆడిట్ సిబ్బంది నిలదీశారు. కొలతల ప్రకారం యూనిఫాంలు తయారుచేసి ఇచ్చే బాధ్యత కాంట్రాక్టర్‌దేనని, అయినప్పటికి ఎందుకు నిర్లక్ష్యం చేశార ని ఆడిటర్లు అగ్నిమాపక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా 10 శాతం జరిమానా వసూలు చేయాలని సూచించారు.