తండ్రిని చంపాడని..
ఇస్తాంబుల్: తండ్రిని చంపిన ఆగంతకుడు కళ్ల ఎదుటే కనిపించడంతో కసితో రగిలిపోయిన ఓ వ్యక్తి రెస్టారెంట్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఇస్తాంబుల్‌లోని బిగ్చెఫ్ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
రెస్టారెంట్లోకి చొరబడిన దుండగుడు తన తండ్రి మరణానికి కారణమైన వాడిని అందుకు ప్రతీకారంగా చంపేస్తున్నానని చెప్పి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్ చుట్టూ భద్రతాఏర్పాట్లు చేశారు. దుండగుడి కోసం గాలింపులు జరుపుతున్నారు. నూతన సంవత్సర వేడుకల ముందురోజు ఇస్తాంబుల్‌లో మారణహోమం జరిగింది. అందులో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర ఘటన మరవకముందే మరో దారుణం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.