బంపర్ జాక్పాట్తో ‘ఆయా’ సెన్సేషన్
న్యూయార్క్: అదృష్టం అలా ఇలా కాదు.. ఏకంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ జాక్ పాట్ ఆ మహిళ సొంతం అయ్యింది. సుమారు 758.7 మిలియన్ డాలర్ల లాటరీని సొంతం చేసుకుని ఆనందంలో ఉబ్బి తబ్బిబి అవుతోంది.
మస్సాచుసెట్ట్స్ కు చెందిన 53 ఏళ్ల మావిస్ వాంస్జిక్, మెర్సీ మెడికల్ కేర్ లో ఆయా(పెషెంట్లకు సహయకురాలు)గా పని చేస్తోంది. పశ్చిమ బోస్టన్ లోని చికొప్పి స్టోర్ లో కుటుంబ సభ్యుల పుట్టినరోజు తేదీల సంఖ్య ఆధారంగా ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. గురువారం దాని ఫలితం వెలువడగా, సుమారు 758.7 మిలియన్ డాలర్ల( సుమారు 48 వేల కోట్లు) జాక్ పాట్ తగిలినట్లు ప్రకటించారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మావిస్ గత నవంబర్ లో యాక్సిడెంట్లో భర్తను కోల్పోయింది. ఆర్థికంగా పెద్దగా కష్టాలు లేని కుటుంబం ఆమెది. అయినా పిల్లలతోపాటు ఆమె కూడా ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే వస్తోంది.
అయితే అనుకోకుండా తగిలిన ఈ జాక్పాట్తో తన కుటుంబం స్థిరపడినట్లేనని ఆమె వ్యాఖ్యానిస్తోంది. అన్ని టాక్స్‌లు పోను ఆమె చేతికి 336 మిలియన్ డాలర్లు అందుతాయి. ఇక ఆమెకు అభినందనలు తెలుపుతూ మస్సాచుసెట్ట్స్ స్టేట్ లాటరీ అసోషియేషన్ ఏర్పాటు చేసిన ఓ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా అందులో ఆమె ప్రసగించింది. ‘లాటరీ వాళ్ల దగ్గరి నుంచి మళ్లీ ఫోన్ వస్తుందని ఊహించలేదు. మొదట భయపడిపోయా. తర్వాత ఇదంతా నిజమేనా అని మరోసారి ధృవీకరించుకున్నా. ఇప్పుడు ఆనందంలో ఉన్నా. ఇంటికెళ్లాక మంచం కింద దాక్కుంటా. ఓ నల్ల కళ్లజోడు పెట్టుకుని ఖరీదైన డ్రెస్, కాస్ట్లీ నగ వేసుకుని సంబరాలు చేసుకుంటా’ అని తెలిపింది. కొత్తగా కొన్న కారు లోను క్లియర్ చేయటంతోపాటు, ఉద్యోగం వదిలేసిన ఆమె మిగతా డబ్బును ఎలా ఖర్చుపెట్టాలన్న దానిపై ఫ్లాన్ చేస్తోందంట.
ఇక అమెరికా చరిత్రలోనే ఇదే అత్యధిక సింగిల్ టికెట్ లాటరీ అని సమాచారం. గతేడాది జనవరిలో 1.6 బిలియన్ డాలర్ల లాటరీ తగిలినప్పటికీ అది ముగ్గురు వ్యక్తులకు(షేరింగ్ లాటరీ) చెందడటంతో ప్రస్తుతం మావిస్కు తగిలిన లాటరీనినే హయ్యెస్ట్ లాటరీగా పరిగణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.