‘బీజామృతం’ తయారీ ఎలా?
ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడం కాబట్టి సాధ్యమైనంత వరకు నాటు లేదా దేశవాళీ విత్తనాలనే వాడుకోవాలి. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని సరిగ్గా శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా పంట, దిగుబడి బాగుంటాయి. విత్తనాలను ‘బీజా మృతం’తో శుద్ధి చేయడం ముఖ్యమైన అంశం.
‘బీజామృతం’ తయారీకి కావలసిన పదార్థాలు:
నీరు 20 లీటర్లు + ఆవు మూత్రం 5 లీటర్లు + ఆవు పేడ 5 కిలోలు + పొడి సున్నం 50 గ్రాములు, పొలం గట్టు మీద మట్టి దోసెడు.
తయారు చేసే విధానం: తొట్టిలో 20 లీటర్ల నీరు పోసి.. ఆవు పేడను పల్చటి గుడ్డలో మూట కట్టి 12 గంటల సేపు నీటిలో ఉంచాలి. ఠీ ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. ఠీ రెండో రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో పిండి.. సారాన్ని నీటి తొట్టిలో కలపాలి. ఠీ పేడ నీళ్లున్న తొట్టిలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కలియతిప్పాలి. ఠీ 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి.. కలిసే వరకు తిప్పితే.. బీజామృతం సిద్ధమైనట్లే.
విత్తనాలను ప్లాస్టిక్ కాగితంపై పోసి తగినంత బీజామృతం పోసి కలపాలి. విత్తనాలకు బీజామృతం బాగా పట్టిన తర్వాత.. విత్తనాలను కొద్దిసేపు నీడన ఆరబెట్టుకొని విత్తుకోవచ్చు. నారును, మొక్కలను కూడా బీజామృతంలో ముంచి నాటుకోవచ్చు.