ఘనంగా సందల్ షరీఫ్ ఉత్సవం
జన సంద్రంగా మారిన దర్గా
ఆకట్టుకున్న ఖవ్వాలీ సమ్మేళనం
పోలీస్ బందోబస్తు
జమ్మికుంట రూరల్: ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ దర్గాలో బుధవారం వేకువజామున ప్రధాన ఘట్టమైన సందల్(గ్రంథ లేపనం) ఉత్సవం ఘనంగా జరిగింది. పెద్ద బిజిగిరిషరీఫ్, మొల్లపల్లి గ్రామాల నుంచి దర్గా ముతావళీ, భక్తులు గ్రంథ లేపనాన్ని డప్పు చప్పుళ్లు, యువకుల కర్రసాముల, అల్లాహ్ కీర్తనలతో దర్గా వద్దకు వేకువజామున 4గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. భక్తి,శ్రద్ధలతో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళీ రహ్మతుల్లా ఆలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజావళీ, హజ్రత్ సయ్యద్ అక్బర్షావళీ సమాధులపై అలంకరింపజేశారు. సందల్ దర్గా ప్రాంతానికి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. హిందూముస్లిములు తరలొచ్చి అల్లాహ్‌ను స్మరించుకుని సమాధులను దర్శించుకున్నారు. పలువురు కందుర్లు(న్యాజ్) పేరిట మొక్కులు చెల్లించుకున్నారు. కొత్తగూడెంకు చెందిన అశుర్ఖానా కమిటీ గౌరవ అధ్యక్షుడు గాజి గోవర్ధన్ భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
భక్తులను ఆకట్టుకున్న ఖవ్వాలీ
మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను ఆలపిస్తూ నాందేడ్, ఆగ్రాకు చెందిన మహ్మద్ సలీంపాషా, మహ్మద్ గులాం ఆలీ చిస్తి బృందాల చేసిన ఖవ్వాలీ సమ్మేళనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముతావళీ దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియా, ఉపాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ కరీం, కార్యదర్శి ఇక్బాల్, ఎంపీటీసీ సభ్యురాలు చందుపట్ల స్వాతి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సమీర్ పాల్గొన్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.