దొంగలు అరెస్ట్ : 27 బైకులు స్వాధీనం
పుల్బనీ : బైకులు చోరీ చేసి... విక్రయిస్తున్న ముఠా గుట్టును ఒడిశాలోని కంధమాల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి పర్వత్ కుమార్ ప్రాణిగ్రాహి మంగళవారం వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బైకుల్లో పలు రకాల కంపెనీలకు చెందినవి ఉన్నాయని తెలిపారు.
అలాగే వారి వద్ద నుంచి వాహనాలకు చెందిన నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ నంబర్లు, నకిలీ బండి కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గత మూడు రోజులుగా పుల్బనీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సదరు దొంగలను తమదైన శైలిలో విచారించగా... కటక్, భువనేశ్వర్, కుర్థా ప్రాంతాల్లో ఈ బైకుల చోరీకి పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే ఇదే జిల్లాలోని బల్లిగూడలో గత రెండు నెలల క్రితం పోలీసుల తనిఖీల్లో బైకు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 48 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.