రోడ్లన్నీ సైకిళ్లతో నిండిపోవాలి: నరసింహన్
హైదరాబాద్: వచ్చే పదేళ్లలో హైదరాబాద్ రోడ్లు సైకిళ్లతో నిండిపోవాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీ గచ్చిబౌలిలో నిర్మించిన బైక్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ... ‘నగరంలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. దీన్ని నివారించాల్సిన బాధ్యత నగరావాసులందరిపై ఉంది. ప్రస్తుతం ప్రారంభమైన బైక్ టు వర్క్ (పనికి సైకిల్‌పై పోదాం) ప్రయత్నం నగరం అంతా విస్తరించాలి. మెట్రో రైల్ సైకిల్ స్టేషన్లతో అనుసంధానం చేస్తే ఎక్కువ మంది సైకిళ్లపై ఆఫీసులకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చే పదేళ్లలో నగరమంతా సైకిల్ ట్రాక్ లు విస్తరించేలా జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు మాట్లాడుతూ... నగరమంతా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను విస్తరించేలా ప్రణాలికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం నిర్వహించిన ‘బైసైక్లోన్ -2013’లో వెయ్యికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. మంత్రులు దానం నాగేందర్, ప్రసాద్‌కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ , డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్, హైరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చైర్మన్ డీవీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.