యోగా గురు బిక్రమ్ చౌదురికి భారీ జరిమానా
హాట్ యోగా గురు బిక్రమ్ చౌదురికి లాస్ ఏంజిల్స్ కోర్టు భారీ జరిమానా విధించింది. యోగాలో ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బిక్రమ్.. సుమారు తొమ్మిది లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బిక్రమ్ చౌదురి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిరూపణ కావడంతో లాస్ ఏంజిల్స్ జ్యూరీ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది.
మీనాక్షీ జాఫా బోడెన్ అనే బాధిత మహిళ... తనపై బిక్రమ్ వేధింపులకు పాల్పడ్డాడని, న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కింది. బోడెన్ ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన లాస్ ఏంజిల్స్ కోర్టు... ఇరువైపుల వాదలను విన్న అనంతరం... బిక్రమ్‌ను దోషిగా తేల్చింది. దీంతో 9,24,500 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇదో అపారమైన తీర్పు అని బాధితురాలు తరపు న్యాయవాది కార్లా మిన్నర్డ్ వెల్లడించారు. తన క్లైంట్ జాఫా బోడెన్పైను బిక్రమ్ చౌదురి.. తాకేందుకు ప్రయత్నించడం, హోటల్ గదిలో తనతో ఉండాలని బలవంతం చేయడం వంటి అనేక రకాలైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దీంతో 2013 జూన్ లో బాధితురాలు కోర్టును ఆశ్రయించిందని న్యాయవాది మిన్నర్డ్ చెప్పారు.
69 ఏళ్ళ బిక్రమ్ చౌదురి 2003, సెప్టెంబర్ 27న యోగా ఎక్స్పో పేరిట లాస్ ఏంజిల్స్.. కన్వెన్షన్ సెంటర్లో యోగా శిక్షణా తరగతిని నిర్వహించారు. సుమారు వంద డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత కలిగిన గదిలో 90 నిమిషాలపాటు ప్రత్యేక టెక్నిక్‌తో యోగా ప్రదర్శన ఇచ్చారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 650 స్టూడియోల్లో తమ శిష్యుల ద్వారా ప్రదర్శనలు చేసి చౌదురి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహిళపై వేధింపులు రుజువు కావడంతో లాస్ ఏంజిల్స్ కోర్టు అతడికి జరిమానా విధించింది.
యోగా శిక్షణ పేరిట ఈ హాట్ యోగా గురు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఇంతకు ముందే కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. తొమ్మిది వారాల శిక్షణా తరగతి కోసం కళాశాల ఫండ్ నుంచి తాను పదివేల డాలర్లు చెల్లించానని... అయితే తనపై శిక్షణ పేరిట బిక్రమ్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కెనడియన్ మహిళ సైతం కోర్టును ఆశ్రయించింది. అయితే బిక్రమ్ తరపు న్యాయవాదులు మాత్రం ఇంతకు ముందు అతడెప్పుడూ హింసాత్మక ఘటనలకు, లైంగిక చర్యలకు పాల్పడలేదని చెప్తున్నారు.