జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేపీ బీనా పవర్ ప్లాంటు
- ఒప్పందం విలువ రూ. 3,500 కోట్లు
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తాజాగా జేపీ గ్రూప్‌నకు చెందిన బీనా థర్మల్ పవర్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. దీనికి ఎంత వెచ్చిస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ.. సుమారు రూ. 3,500 కోట్లు చెల్లించేందుకు సంస్థ సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌కు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 500 మెగావాట్ల సామర్థ్యం గల బీనా థర్మల్ పవర్ ప్లాంటు మధ్యప్రదేశ్‌లో ఉంది.
మరోవైపు, రూ. 9,700 కోట్లతో జేపీ గ్రూప్‌కే చెందిన హిమాచల్ బాస్పా పవర్ కంపెనీ (హెచ్‌బీపీసీఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. హెచ్‌బీపీసీఎల్‌కి హిమాచల్ ప్రదేశ్‌లో రెండు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ డీల్‌ను గతేడాది నవంబర్‌లో కంపెనీ ప్రకటించింది. దేశీ విద్యుత్ రంగంలో ఇది భారీ ఒప్పందం అని జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. మంగళవారం బీఎస్ఈలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు దాదాపు 10 శాతం లాభంతో రూ. 74.25 వద్ద, జేపీవీఎల్ షేర్లు 5 శాతం పెరిగి రూ. 5.85 వద్ద ముగిశాయి.