వచ్చే నెల 4న హఫీజ్‌కు బౌలింగ్ పరీక్ష!
కరాచీ: కీలకమైన ప్రపంచకప్‌కు ముందే తమ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌ను బయోమెకానిక్ పరీక్ష నుంచి గట్టెక్కించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నిస్తోంది. ఇందుకోసం హఫీజ్ బౌలింగ్‌ను మరోసారి అంచనా వేయాలని అధికారికంగా ఐసీసీని కోరింది. దీంతో ఫిబ్రవరి 4న ఆల్‌రౌండర్ బ్రిస్బేన్‌లో పరీక్షకు హాజరయ్యే అవకాశాలున్నాయని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే కంటే ముందు కివీస్‌లో తన బౌలింగ్‌పై మరిన్ని కసరత్తులు చేసుకునేందుకు హఫీజ్‌కు అవకాశం ఇవ్వాలని పాక్ టీమ్ మేనేజ్మెంట్ పీసీబీకి సూచించింది.
మరోవైపు ఐసీసీ నుంచి క్లియరెన్స్ రాకపోతే హఫీజ్ తుది జట్టులో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్, చెన్నైల్లో జరిగిన అనధికారి పరీక్షల్లో బౌలర్ విఫలమయ్యాడు. అయితే ఈ రెండు టెస్టుల్లో హఫీజ్ విఫలమైనా... అతని బౌలింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉందని సదరు అధికారి వెల్లడించారు. స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఐసీసీ అధికారిక బయోమెకానిక్ పరీక్ష కోసం శుక్రవారం చెన్నైకి వెళ్లనున్నాడు.
జెర్సీ నంబర్లలో మార్పులు
వరల్డ్‌కప్‌లో రాణించేందుకు వీలుగా కొంత మంది పాక్ ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పులు చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక గురువులను సంప్రదించిన తర్వాత ఉమర్ అక్మల్ తన జెర్సీ నంబర్ 96 స్థానంలో 3ను ఎంచుకున్నాడు. హరిస్ సోహైల్ 80 స్థానంలో 89వ నంబర్‌ను తీసుకున్నాడు.
బౌలర్లందరూ డబుల్ డిజిట్ నంబర్లను ఎంచుకున్నారు. వహబ్ రియాజ్ 47, ఎహ్సాన్ అదిల్ 91, యాసిర్ షా 86ను ధరించనున్నారు. ఆఫ్రిది 10, మిస్బా 22, యూనిస్ 75 నంబర్లతోనే కొనసాగుతున్నారు. గతంలో ఇంజమామ్ ధరించిన 8వ నంబర్‌ను హఫీజ్‌కు పాక్ బోర్డు కేటాయించింది.