ఆత్మరక్షణ అందరికి అవసరం
శ్రీశైలం ప్రాజెక్టు(కర్నూలు): ప్రస్తుత సమాజంలో ఆత్మరక్షణ అందరికీ అవసరమని, ముఖ్యంగా స్త్రీలకు ఇంకా అవసరమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శ్రీశైలంప్రాజెక్టులో తైక్వాండో జిల్లా కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు, మరియబాబు, విజయబాబుల పర్యవేక్షణలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమప్రతిభను కనబర్చారు. ముఖ్య అతిథిగా హాజరైన బెరైడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ తైక్వాండో క్రీడ శారీరక దారుఢ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాని కలిగిస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం ఈ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అంతర్జాతీయ క్రీడ అయిన తైక్వాండో మారుమూల గ్రామాలలోకి కూడా తీసుకెళ్లాలని, ఆ దిశగా అసోసియేషన్ కృషి చేయాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర 34వ సీనియర్ విభాగం, 35వ జూనియర్ విభాగాల రాష్ట్రస్థాయి పోటీలను శ్రీశైలంప్రాజెక్టులో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తైక్వాండో క్రీడను ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం బాలికలు నేర్చుకోవాలని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల క్రీడాకారులు బంగారు పతకాలు సాధించగా, కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు ముందుంజలో ఉన్నారు.