బిర్లా కార్ప్ చేతికి లఫార్జ్‌హోల్సిమ్ ప్లాంట్లు
- జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు సిమెంట్ ప్లాంట్ల కొనుగోలు
- డీల్ విలువ రూ. 5 వేల కోట్లు...
- ఒకే రోజు 20 శాతం పెరిగిన బిర్లా కార్ప్ షేరు ధర
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం లఫార్జ్-హోల్సిమ్కు భారతదేశంలో ఉన్న రెండు ప్లాంట్లను ఎంపీ బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన బిర్లా కార్పొరేషన్ కొనుగోలు చేసింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఉన్న ఈ ప్లాంట్ల విక్రయానికి బిర్లా కార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం లఫార్జ్ హోల్సిమ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.5,000 కోట్లు (75 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లు). ఫ్రాన్స్‌కు చెందిన లఫార్జ్, స్విస్ కంపెనీ హోల్సిమ్‌లు విలీనం కావడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ మెటీరియల్ సరఫరా సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే, లఫార్జ్ ఇండియాకు తూర్పు భారతంలో ఉన్న ఒక సిమెంట్ ప్లాంట్, మరో గ్రైండింగ్ స్టేషన్లను విక్రయించాలన్న షరతుమీదే ఈ విలీనానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కాంపిటీషన్ కమీషన్(సీసీఐ) ఆమోదముద్ర వేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ రెండు ప్లాంట్లను బిర్లా కార్ప్‌కు విక్రయించినట్లు లఫార్జ్ హోల్సిమ్ గ్రూప్ తెలియజేసింది. ఈ అమ్మకం ద్వారా వచ్చే నిధులను రుణాలను తగ్గించుకోవడానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తాజా డీల్ తర్వాత కూడా భారత్‌లో లఫార్జ్ హోల్సిమ్కు 68 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉంటుంది. రెండు పరోక్ష అనుబంధ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా హోల్సిమ్కు భారత్‌లో కార్యకలాపాలున్నాయి. లఫార్జ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, లఫార్జ్ అగ్రిగేట్స్ అండ్ కాంక్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్... ఈ రెండు పరోక్ష సబ్సిడరీల ద్వారా లఫార్జ్ ఇక్కడ సిమెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
బిర్లా కార్ప్... తూర్పున విస్తరణ
ఛత్తీస్‌గఢ్‌లోని సొనాది ప్లాంట్, జార్ఖండ్‌లోని జోజోబెరా ప్లాంట్లను కొనుగోలు చేయడానికి లఫార్జ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిర్లా కార్ప్ ధ్రువీకరించింది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.15 మిలియన్ టన్నులు. ఈ ప్లాంట్లతో పాటు కాంక్రిటో, పీఎస్సీ బ్రాండ్లు కూడా తమకు లభిస్తాయని తెలిపింది. తూర్పు భారత్‌లో బిర్లా కార్ప్ విస్తరణకు ఈ రెండు ప్లాంట్ల కొనుగోలు ఉపకరిస్తుంది. ప్రస్తుతం బిర్లా కార్ప్‌కు మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో సిమెంట్ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి.
వీటి వార్షిక సామర్థ్యం 9.3 మిలియన్ టన్నులు. పోటీ మార్కెట్లో మరింత దూసుకెళ్లే విధంగా తాము రూపొందిచుకున్న ప్రణాళిక, వ్యూహానికి ఈ సిమెంట్ ప్లాంట్లతో పాటు కాంక్రీటో, పీఎస్సీ బ్రాండ్ల కొనుగోలు దోహదం చేస్తుందని బిర్లా కార్ప్ చైర్మన్ హర్ష్ లోధా పేర్కొన్నారు. సీసీఐతో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఒప్పందం ఉంటుందని చెప్పారు.
డీల్ నేపథ్యంలో సోమవారం బిర్లా కార్ప్ షేరు ధర అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎష్ఈలో
19.27 శాతం ఎగబాకి రూ.540 వద్ద స్థిరపడింది.