స్టీవ్ జాబ్స్‌కు ఆపిల్ గొప్పకానుక
కపెర్టినో/కాలిఫోర్నియా: ఆపిల్ సంస్థ తన ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. మరో రెండు నెలల్లో తమ సంస్థ కొత్త ఉన్నత కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పింది. అదే రోజు సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పేరిట నిర్మించిన ప్రత్యేక థియేటర్‌ను కూడా ప్రారంభించి ఆయన జయంతి కానుకగా అందించనుంది. ఈ మేరకు తన వెబ్సైట్లో ఆపిల్ సంస్థ ఒక వార్తా ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న పాత కార్యాలయం నుంచి దాదాపు 12,000మందిని తరలించనుంది.
ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించి మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయనుంది. మొత్తం 175 ఎకరాల వైశాల్యంలో ఒక పెద్ద రింగు మాదిరిగా 2.8 మిలియన్ చదరపు అడుగుల వెడల్పులో ఆపిల్ తన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించింది. దీనిని రెనివబుల్ ఎనర్జీ ఆధారిత భవనంగా నిర్మించింది. ఇందులో తమ సంస్థకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి క్యాన్సర్ కారణంగా కన్నుమూసిన స్టీవ్ జాబ్స్ పేరిట దాదాపు వెయ్యిమంది కూర్చునే సామార్థ్యం ఉన్న పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించింది. దీనికే స్టీవ్ జాబ్స్ ఆడిటోరియం అని నామకరణం చేసింది. 2011లో క్యాన్సర్ కారణంగా స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు.