కులం మూలంపై తొలి వేటు
కొత్త కోణం
అంబేడ్కర్ ‘కులాల పుట్టుక’ నూరేళ్ల తరువాత కూడా ప్రామాణికమైనదిగా నిలిచింది. ‘‘కులం ఉనికిలోకి రావడం, దీర్ఘకాలం మనుగడ సాగించడం ఆశ్చర్యకరమైన, జటిలమైన సమస్యలు. కులం మనుగడకు అవసరమైన షరతులు కఠినమైనవి. ఒక విశ్వాసం పునాదిపై సాంఘిక వ్యవస్థ నిలబడాలంటే అంతకు ముందే ఆ వ్యవస్థ పుట్టి, పెరిగి, గట్టిపడి ఉండాలి’’ అంటూ పరిశోధక విద్యార్థిగానే అంబేడ్కర్ కొత్త దారిని చూపారు. సత్యాన్వేషణలో పక్షపాతానికి, వ్యక్తిగత అభిప్రాయానికి చోటు లేదని స్పష్టం చేశారు.
‘‘కులంపై సామాజిక శాస్త్రవేత్తలు గతంలో చేసిన నిర్వచనాలను పరిశీలిస్తే అవి అవసరమైన దానికన్నా ఎక్కువగానో, లేదా సంక్షిప్తంగానో ఉన్నట్టు తోస్తున్నది. ఏ ఒక్కటీ సంపూర్ణంగా లేదు. కుల వ్యవస్థకు గుండెకాయలాంటి అత్యంత కీలకమైన అంశాన్ని వారు పూర్తిగా విస్మరించారు. వీరంతా కులాన్ని మొత్తం కులవ్యవస్థలో ఒక అంతర్భాగంగా, ఇతర కులాలతో నిర్దిష్ట సంబంధాలుగల సమూహంగా కాక, తన చోట తాను స్వతంత్ర అస్తిత్వంలో ఉన్న యూనిట్‌గా నిర్వచించే ప్రయత్నం చేశారు’’ అంటూ పట్టుమని పాతికేళ్ళు కూడా లేని ఒక యువకుడు 1916లో గళమెత్తాడు.
అంతకు ముందు భారత కుల వ్యవస్థను అధ్యయనం చేసిన ఫ్రెంచి పండితుడు సెనార్ట్, సామాజిక వేత్త నెస్‌ఫీల్డ్, జనాభాగణన అధికారి రిస్లీ, భారత సామాజికవేత్త డాక్టర్ కేట్కర్‌లు కులాన్ని నిర్వచించిన తీరును చర్చిస్తూ... ధైర్యంగా ఆ యువకుడు కుల వ్యవస్థ అధ్యయనానికి నూతన పథ నిర్దేశన చేయడానికి ముందుకొచ్చాడు. నాడు కొరకరాని కొయ్యగా ఉన్న ‘‘కుల సమస్య పుట్టుక-దాని-నిర్మాణం-ప్రభావం’’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ఆ యువకుడు మరెవరో కాదు... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్!
‘కులం పుట్టుక ’ పోరుకు నాంది
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా ఉండగా మానవ శాస్త్ర(ఆంత్రోపాలజీ) విభాగం 1916 మే రెండవ వారంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ఆ పరిశోధనా పత్రాన్ని చదివి వినిపించారు. ఆ పత్రాన్ని సమర్పించి నేటికి నూరేళ్లు. అంబేడ్కర్ ఈ పరిశోధనను కేవలం తన డాక్టరేట్ డిగ్రీ కోసమే చేయలేదనేది ఆ తర్వాత సాగిన ఆయన జీవనయానమే స్పష్టం చేస్తుంది. ఆయన కులంపై పరిశోధనకు పరిమితంగాక, యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధాన్ని తుదకంటా కొనసాగించాడు. కుల సమస్యకు పరిష్కారాన్ని చూపాడు. అందుకే అంబేడ్కర్ ఒక విద్యార్థిగా కులంపై చేసిన ఆ పరిశోధనకు చాలా ప్రాధాన్యమున్నది.
అంతేకాదు, సామాజిక పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా ఆయన చేసిన అనన్య సామాన్య కృషిలోని తొలి మైలు రాయి. అంబేడ్కర్ తర్వాత 1932లో జీఎస్ గుర్యే రాసిన ‘క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా’ పుస్తకం కులంపై ప్రామాణిక గ్రంథంగా చలామణిలో ఉంది. గుర్యే తన గ్రంథానికి చివర ఇచ్చిన ఉపయుక్త గ్రంథాల పేర్లలో అంబేడ్కర్ పరిశోధనా పత్రం పేరు లేకపోవడం యాదృచ్ఛికమా? లేదా కావాలనే ఆయన పేరును విస్మరించారా? ఏది ఏమైనా సామాజిక పరిశోధనలో అంబేడ్కర్ కృషిని విస్మ రించారనేది స్పష్టమే.
అంబేడ్కర్ అనంతరం వచ్చిన పరిశోధనా గ్రంథాలలో కూడా ఇక్కడి పరిస్థితులపై సమగ్రమైన విశ్లేషణ లేకపోవడం గమనిస్తూనే ఉన్నాం. నూరేళ్ళ తరువాత కూడా ఆయన రాసిన ‘కులాల పుట్టుక’ ప్రామాణికమైనదిగా ఉండటం విశేషం. ఆ పరిశోధనలో నాలుగు విషయాలను అంబేడ్కర్ ప్రధానమైనవని ప్రకటించాడు. ఒకటి, కులం ఒక అఖండ సాంస్కృతిక వ్యవస్థను ముక్కలుగా విడగొట్టడం. రెండు, కులం మొదట ఒక తెగగా మొదలుకావడం. అనుకరణ, బహిష్కరణ అనే మిగతా రెండు క్రమాల వల్ల కులాలు రూపొందడం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘నిజానికి కులం ఉనికిలోనికి రావడం, దీర్ఘకాలం మనుగడ సాగించగలగడం అన్నవి చాలా ఆశ్చర్యకరమైన, జటిలమైన సమస్యలు. ఎందుకంటే కులం మనుగడకు అవసరమైన షరతులు చాలా కఠినమైనవి. విశ్వాసంపై కులం ఆధారపడి ఉండే మాట నిజమే. కానీ ఒక విశ్వాసం అనే పునాదిపై సాంఘిక వ్యవస్థ నిలబడాలంటే అంతకు ముందే ఆ వ్యవస్థ పుట్టి, పెరిగి గట్టిపడి ఉండాలి’’ అంటూ ఆయన కులం పునాదిని వివరించారు.
పరిశోధనలో పక్షపాతానికి తావు లేదు
కులం నిత్య జీవితాచరణలో చాలా ముఖ్యమైనదని చెప్తూనే.... కులం మూలాలను సైద్ధాంతికంగా విశ్లేషించాలనే ఆసక్తిని కూడా అంబేడ్కర్ ఆ పరిశోధనా పత్రంలో వెలిబుచ్చారు. అయితే తన నిర్ధారణలు సరైనవని, అవి మాత్రమే సహేతుకమైనవని తనకు అనిపించవచ్చునని... అయితే ఆ విషయంలో అంతిమ సత్యాన్ని కనుగొన్నానని చెప్పేంత భ్రమలు తనకు లేవని కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంపై మరింత లోతైన, సమగ్రమైన చర్చ జరగడానికి తన వంతు కృషి చేస్తానని మాత్రమే చెప్పారు. కులంపై పరిశోధనను సరియైన దారిలోకి తెచ్చి, సత్యాన్వేషణను సుగమం చేయడానికి తాను ప్రయత్నించానని, ఇందులో ఎలాంటి పక్షపాతానికి వ్యక్తిగత అభిప్రాయానికి చోటు లేదని, ఉండకూడదని స్పష్టం చేశారు.
ఆయన తన నలభైయేళ్ళ అధ్యయన, ఉద్యమ ప్రస్థానంలో సరైన, నిజాయితీ కలిగిన పరిశోధకుడిగా, నాయకుడిగా తన కృషిని సాగించార నడానికి అంబేడ్కర్ రచనలు, ఆచరణే నిదర్శనాలు. కుల వివక్షకు వ్యతి రేకంగా సాగించిన మహద్ చెరువు, కాలారాం ఆలయ ప్రవేశ పోరాటాలు అంబేడ్కర్ ఉద్యమ గమనాన్ని ఖరారు చేశాయి. 1930-31 లండన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేడ్కర్ రాజకీయ హక్కుల కోసం పోరాటం సాగించడమే కాదు... కులంపైన, దాన్ని పెంచి పోషిస్తోన్న హిందూ మతం పైన కూడా పోరాడారు. 1936లో కుల నిర్మూలన కోసం ఒక మహత్తర పోరాటానికి ఆయన మార్గం వేశారు. అంబేడ్కర్ ‘కుల నిర్మూలన’ ఆ ఉద్యమ ప్రస్థానంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఆయన కుల నిర్మూలనా కార్యక్రమంతోపాటూ... హిందూ మతం మనుగడ సాగించాలంటే అనుసరిం చాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. నేటికీ హిందూ మత సంరక్షకు లెవ్వరూ దాన్ని పట్టించుకోకపోగా, వారి సనాతన భావాలను వదులు కోవడానికి సిద్ధంగా లేరు. దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు.
‘అస్పృశ్యులెవరు?’
కులానికి సంబంధించిన పలు విషయాలతో పాటూ అంటరానితనం మూలాలను సుస్పష్టంగా చెప్పగలిగినది అంబేడ్కర్ మాత్రమే. ఆయన రాసిన ‘అస్పృశ్యులెవరు?’ అనే గ్రంథమే అందుకు సాక్ష్యం. ఇది కూడా ఈ సమస్యపై అంతకు ముందటి రచనలను, అధ్యయనాలను పూర్వపక్షం చేసింది. అపరిశుభ్రత, ఆవు మాంసం తినడం లాంటి విషయాలే అంటరాని తనానికి కారణాలనే వాదనలను అంబేడ్కర్ ఒక్కొక్కటిగా ఉదాహరణలతో సహా తిరస్కరించారు. అపరిశుభ్రత అన్ని చోట్లా ఉన్నదని, అన్ని కులాల్లో అది సర్వసాధారణమని, అదెంత మాత్రం అంటరానితనానికి కారణం కాదని చెప్పారు. ఆవు మాంసం విషయానికొస్తే అంటరాని కులాలు మాత్రమేకాక, ఇతరులు చాలా మంది ఆవు మాంసం తింటున్నట్టు రుజువు చేశారు.
అంతేగాక చారిత్రక విశ్లేషణ ద్వారా ఆయన హిందూ మత రక్షకులుగా ఉన్న వారే మాంసాహారులుగా ఉన్న విషయాన్ని శాస్త్ర గ్రంథాల సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. నిజానికి అంటరానితనాన్ని రాజకీయ సమస్యగా చూడా ల్సిందే తప్ప, కేవలం ఆచార వ్యవహారాలకు సంబం ధించినది కాదని చెప్పారు. చివరగా, బౌద్ధంపై వైదిక మతం చేసిన దాడుల వల్ల భయపడి అందులోనుంచి లొంగిరాని తెగలను, ప్రజలను ఊరు నుంచి, సమాజం నుంచి వెలివేసినట్టు తేల్చారు. బౌద్ధులను రాజకీయంగా అణచివేయడం కోసమే ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారని, అంతిమంగా వారు అంటరాని కులాలుగా ఏర్పడ్డారని తేల్చి చెప్పారు. రాజకీయ, సామాజిక మతపరమైన అంశాలు ఏ విధంగా అంటరానితనాన్ని పెంచి పోషించాయనే విషయాన్ని ఆయన తెలిపారు. హిందూ మత తాత్విక చింతనను తెలియజేస్తూనే అందులో ఉన్న వివిధ అంశాలను విశ్లేషించారు. ముఖ్యంగా ఆయన ‘రాముడు, కృష్ణుడి రహస్యాలు’ రచనలో వారికి సంబంధించిన చారిత్రక విషయాలను నేటి సామాజిక ధృక్పథం నుంచి వివరించారు.
ఆ రచన హిందూ మతంలో సంచలనాన్ని రేపింది. కులాల రూపకల్పన చేసిన మనువుని ఎండగట్టడం ఆయన రచనల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. ‘శూద్రు లెవరు?’ అనే అంశంపై చేసిన ఆయన జరిపిన పరిశోధన కూడా అత్యంత విశిష్టమైనది. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించిన క్షత్రియులను వర్ణవ్యవస్థ లోని నిచ్చెన పై మెట్ల నుంచి కిందకు తోసి శూద్రులుగా ముద్ర వేశారని ఆయన ఆధారాలతో బయటపెట్టారు.
దీని కొనసాగింపుగానే భారతదేశ చరిత్రపై కూడా ఆయన తన పరిశోధనను కొనసాగించారు. ఆయన రాసిన ‘విప్లవం, ప్రతీఘాత విప్లవం’ అనే పుస్తకం ఈ దేశంలో బౌద్ధం సాధించిన విజయాన్ని, హైందవం జరిపిన మారణకాండను సోదాహరణంగా వివరించింది. అంతేగాక, భారత దేశ చరిత్రను హిందూమతానికీ, బౌద్ధానికీ మధ్య జరిగిన సంఘర్షణగా వివరించడం ద్వారా అంబేడ్కర్ ఒక పరిణతి చెందిన చరిత్రకారుడిగా మనకు దర్శనమిస్తారు. 1936 ప్రాంతంలో ఒక సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ తాను హిందువుగా పుట్టడం తన చేతుల్లో లేదని, కానీ తాను హిందువుగా మాత్రం మరణించనని ప్రకటించారు. అన్నట్టే ఆయన 1956 అక్టోబర్ 14న బౌద్ధం స్వీకరించారు. తద్వారా హిందుత్వం సృష్టించిన కులాన్ని జయించి విజయపతాకాన్ని ఎగురవేశారు. 1916లో కులంపైన పరిశోధనలు మొదలు పెట్టిన పాతికేళ్ళ యువకుడు 40 ఏళ్ళ తరువాత అదే కులాన్ని తిరస్కరించి ఒక నవసమాజ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు.
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213