జీసస్ జన్మదిన సంబరం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రతి ఏడాది డిసెంబరు 25న క్రీస్తు జన్మదినంగా భావిస్తూ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా చర్చిలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే చర్చిల్లో ప్రార్థనలు ప్రారంభమయ్యూయి. వేలాది మంది కుటుంబ సమేతంగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు తమ ఇళ్లను నక్షత్రపు బొమ్మలతో, రంగు కాగితాల తోరణాలతో తీర్చిదిద్దుకున్నారు. క్రిస్మస్ చెట్టును తయారుచేసి అందులో చిన్న చిన్న బొమ్మలను, బహుమతులను అమర్చారు. ఏసు జన్మించినట్లుగా చిన్నపాటి గృహం, అం దులో బాల ఏసు బొమ్మను ఏర్పాటు చేసి ప్రదర్శనకు ఉంచారు. మంగళవారం రాత్రి అనేక చర్చిలు ప్రార్థనా మందిరాల్లో ఏసు నామజపం నిర్వహించారు.
చర్చిల నుంచి బయలుదేరిన భజన బృందం వీధుల్లో తిరుగుతూ ఏసు ప్రార్థనలు వినిపించింది. క్రైస్తవ కుటుంబాల్లోని వారు క్రిస్మస్ తాత వేషాన్ని ధరించి బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై అన్నా ఫై్లఓవర్ వద్ద నున్న సెయింట్ జార్జ్ చర్చిలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్ ఇమ్మాన్యుయేల్ దైవకటాక్షం ప్రార్థనను నిర్వహించారు. ఈ చర్చిలో ఏర్పాటుచేసిన 25 అడుగుల ఎత్తు క్రిస్మస్ ట్రీ ఆకర్షణగా నిలిచింది. నుంగంబాకంలోని పునీత మదర్ థెరీసా ఆలయంలో ఫాదర్ లారెన్స్రాజ్ ఆధ్వర్యంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. అడయార్‌లోని ఏసు అన్బర్ సీఎస్ఐ చర్చిలో ఫాదర్ జగదీష్ లెక్లర్ ఆధ్వర్యంలో ఆంగ్లం, తమిళ భాషల్లో వేర్వేరుగా ప్రార్థనలు చేశారు.
వేపేరీలోని మద్రాసు సెయింట్నెరి తెలుగు బాపిస్టు సంఘం వారు క్రిస్మస్తోపాటూ సంఘం 135 వ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు ఈనెల 29, 31, జనవరి 1వ తేదీల వరకు కొనసాగుతాయని సంఘ కాపరి డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బెసెంట్నగర్ మాతా వేలాంగణి ఆలయం, శాంతోమ్ చర్చి తదితర అన్నిచోట్ల భారీ ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో పాల్గొన్నవారందరికీ కేక్ పంచిపెట్టారు. అనేక చర్చిల ముందు పేదలకు అన్నదానం చేశారు. ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) వారు క్లబ్ డాబాపై క్రిస్మస్ వేడుకలను, పాట కచ్చేరీని నిర్వహించారు.