తండ్రి బర్త్‌డేకి వంద బైకులు దానం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వందమంది వికలాంగులకు ప్రత్యేకంగా రూపొందించిన ద్విచక్ర వాహనాలను శనివారం పంచి పెట్టారు. ఆయన తండ్రి, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 71వ పుట్టిన రోజు సందర్భంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వికలాంగుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బైక్‌లను వారికి అందజేశారు.
శారీరక వైకల్యాన్ని పక్కనపెట్టి, మనోధైర్యంతో ముందడుగు వేసిన వందమంది వికలాంగ యువకులను దీనికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అద్భుత విజయాలు సాధించిన వారిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. వారి భవిష్యత్తు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. కాగా రాహుల్ గాంధీ ట్రస్టీ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి యేటీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ.