అబద్ధం ఆడవలసి వస్తోంది!
అబద్ధం... ఒక్కోసారి ఆడాల్సి వస్తుంది. అందంగా అబద్ధాలు చెప్పడంలో మగాళ్లు కూడా ఆడవారికి ఏమాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే... మగాళ్లు అబద్ధం ఆడటానికి కారణం కూడా చాలాసార్లు ఆడవారే!
ప్రేమికుడి కథలు!
ప్రియురాలి రూపంలోనో, భార్య అవతారంలోనో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితంలోకి ప్రవేశిస్తుంది. దాంతో, అబద్ధాలు ఆడాల్సిన తరుణం వచ్చేసినట్టే. అంటే, ‘ప్రేమలో మునిగి ఉన్నవారూ పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు మగ మహారాజులందరూ అసత్య హరిశ్చంద్రులేనా’ అనే పాయింట్ లేవదీయొచ్చు. అందరూ అన్ని సందర్భల్లోనూ అబద్ధాలు ఆడతారన్నది ఇక్కడ చర్చ కాదు. కొన్ని సందర్భాల్లోనైనా మగాడు అబద్ధం చెప్పాల్సి వస్తుందన్నది పాయింట్.
ఎలా అంటారా... నెలలోని నాలుగో ఆదివారం నాడు ‘డియర్... మనం ఐమ్యాక్స్‌లోని ‘స్పైడర్‌మ్యాన్-2’ త్రీడీలో చూద్దామా’ అని ప్రియురాలు ఓ కోరిక కోరిందే అనుకోండి! గుండెమీద చెయ్యేసుకుని జేబు సత్తువ తెలిసున్న ఓ మగాడు చెప్పే అబద్ధం ఏమై ఉంటుంది... ‘ఆ సినిమా బాలేదట. మా ఫ్రెండ్స్ చూసి బాగా బోర్ ఫీలయ్యారట. నెక్స్ట్ వీక్ ఇంకోటి ప్లాన్ చేద్దాం’ అని! అనుకోకుండా ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లాల్సి వస్తే... ‘నాన్న అర్జెంట్‌గా ఊరికి రమ్మని ఫోన్ చేశారు.
తిరిగొచ్చాక నీకు కాల్ చేస్తా’ అని ప్రియురాలితో ప్రియుడు చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌తో పార్టీ... రోజంతా లవర్‌కి ఫోన్ చేయడం కుదర్లేదు. మర్నాడు మగాడు చెప్పే నిజం లాంటి అబద్ధం... ‘సారీరా... నిన్న నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.’ ఈ తరహా సందర్భోచితంగా అబద్ధాలు ఆడటం అనే కళలో మగాడు పట్టు సాధిస్తాడు. ఇక, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చెప్పే అబద్ధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది!
భర్త కథలు!
భర్తగా మారిన మగాడికైతే అబద్ధాలు ఆడాల్సిన సందర్భాలు ఎన్నో! మగాడి మైండ్‌లో ఏవో ఆలోచనలు గిర్రుమంటుంటాయి. సరిగ్గా ఆ సమయంలో ఓ కొత్త చీరకట్టుకుని భార్య ఎదురుగా వస్తుంది. ‘ఏమండీ... ఎలా ఉంది?’ అంటుంది. మనకి ఎలా ఉంటుంది? మూడ్ ఎలా ఉన్నా సరే... ‘చాలా బాగుంది. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు’ అని చెప్పక తప్పని పరిస్థితి. అద్దం ముందు భార్య నిలబడి ఉంటుంది. ‘ఏమండీ... ఈ మధ్య నేను లావైనట్టున్నాను కదా’ అని అడుగుతుంది. ‘అలాంటిదేం లేదు. నీకంటే లావుగా ఎంతమంది లేరు! మనం ఎలా ఊహించుకుంటే అలానే ఉంటాం’ అంటాడు మగాడు. ఆరోజు భార్య బర్త్‌డే.
సాయంత్రం పార్క్‌కి తీసుకెళ్తానని పతిదేవుడు వరమిచ్చేసి ఉంటాడు. కానీ, మరచిపోయి ఉంటాడు! సాయంత్రం ఆవిడ ఫోన్ చేసింది. ‘సారీ... డియర్. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. తొందరగానే బయల్దేరాను, కానీ...’- ఇదీ మగాడి మాట. అనుకోకుండా మిత్రులతో సినిమాకి వెళ్లాల్సి వచ్చింది. థియేటర్లో ఉండగా భార్య ఫోన్ చేసింది. ‘అయామ్ ఇన్ మీటింగ్. కాల్ యు లేటర్’ అనే సందేశం మగాడు పంపాల్సిన సందర్భం ఇది. ప్రేమతో భార్యకి బహుమతి కొంటాడు. మురిసిపోయిన భార్య ‘దీని ఖరీదు ఎంత?’ అని అడుగుతుంది. రేటు తగ్గించి చెప్పాల్సిన తరుణం ఇది.
‘ఇవాళ తలనొప్పిగా ఉంది’, ‘ఇంకోసారి ఆలోచిద్దాం’, ‘వచ్చే ఏడాది గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం’, ‘మీ అమ్మావాళ్లింటి దగ్గర పదిరోజులు ఉండిరా! నా గురించి ఆలోచించకు. పాపం, వాళ్లకీ మా అమ్మాయి నాలుగు రోజులు ఉండాలనే కోరిక ఉంటుది కదా’.. ఇలా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితులు నిత్య జీవితంలో మగాడికి ఎదురవుతూనే ఉంటాయి. అబద్ధం ఒక్కోసారి మగాడికి అవసరం. చాలాసార్లు అదే ఆయుధం. కొన్నిసార్లు అదే వరం. అతి కొద్ది సందర్భాల్లో మాత్రం శాపం!
- సురేష్‌బాబా