'ఆర్మీలో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి'
చండీగఢ్: భారత ఆర్మీలో మహిళల సంఖ్య పెరగాలని, అందుకోసం బాలికలకు మంచి విద్య అందించడంతో పాటు వారిని ఆర్మీలో చేరేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పిలుపునిచ్చారు. దేశసేవలో పాల్గొనేందుకు బాలికలను ప్రోత్సహించాలన్నారు. 'సైనంలో చేరి సేవలందించేందుకు మగ పిల్లలతో సమానంగా మీ కూతుళ్లకు మంచి విద్య, అవకాశాలు కల్పించండి' అని సూచించారు. జులైలో భారత ఆర్మీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం తొలి సారిగా ఆయన స్వగ్రామం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో గల బిషన్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై తన చిన్ననాటి సంగతులను నెమరు వేసుకున్నారు. అనంతరం తాను ప్రాధమిక విద్యను అభ్యసించిన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇదే పాఠశాలలో చదివిన తాను ఆర్మీ చీఫ్ అయ్యానంటే అక్కడ మీరు కూడా ఎదైనా సాధించవచ్చు అని అక్కడ ఉన్న విద్యార్థులలో స్పూర్తిని నింపారు. పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతియేటా స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
తన గ్రామం నుంచి మరింత మంది ఆర్మీలో చేరి సేవలందించాలని కోరుకుంటున్నట్లు దల్బీర్ సింగ్ సుహాగ్ తెలిపారు. అయితే 2000 మంది జనాభా గల ఆ గ్రామంలో ఇప్పటికే 400 మంది ఆర్మీలో పనిచేస్తుండటం విశేషం.