అవినీతి సొమ్ము రక్తపు సొమ్మే
– బిషప్ పూల ఆంథోని
– జిల్లాలో ఘనంగా మట్టల ఆదివారం
కర్నూలు సీక్యాంప్ : అవినీతి సొమ్ము రక్తపు సొమ్మేనని బిషప్ పూల ఆంథోని వ్యాఖ్యానించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలో కోల్స్ చర్చి, ప్రార్థన మందిరం, బిషప్ చర్చిల్లో ప్రార్థనలు చేపట్టారు. అనంతరం మట్టలతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిషప్ చర్చిలో ఫాదర్ కోల విజయరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిషప్ పూల ఆంథోని మాట్లాడారు. చరిత్రలో ఒకడు అవినీతి సొమ్ముకు ఆశపడి తన సొంత గురువును శత్రువులకు అప్పగించారన్నారు.
ఆ గురువు యేసు ప్రభువే అని చెప్పారు. నీతిగా, నిజాయితీగా సంపాదించి పొదుపు చేసిన ప్రతీ రూపాయి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మానవులు మారు మనసు పొంది విరివిగా దాన ధర్మాలు, ఉపవాస ప్రార్థనలు చేసి నవసమాజ నిర్మాణానికి నాంది పలకాని సూచించారు. గుడ్‌ఫ్రైడే నాడు నగరంలో నిర్వహించే సిలువ యాత్ర కార్యక్రమానికి క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఫాదర్ ఒ.జోజిరెడ్డి, ఫాదర్ లూర్ధు, ఉపదేశి ఆంథోని, దళ సభ్యులు, క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు చర్చి యూత్, గాయకబృందం పాల్గొన్నారు.