విద్యార్థులకు వింత డ్రెస్ కోడ్.. తీవ్ర ఆగ్రహం
తిరువనంతపురం: కేరళలో ఓ పాఠశాల తిక్క చేష్టలు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. స్కూల్లో విద్యార్థులపట్ల వివక్షను చూపించే చర్యలకు పూనుకోవడంతో ఆయా చిన్నారుల తల్లిదండ్రులు ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ స్కూల్ ఏం చేసిందో తెలుసా.. తెలివైన పిల్లలు.. తెలివి తక్కువగా ఉండే పిల్లలు అని ప్రత్యేకంగా చూపించేలా వారికి స్కూల్ యూనిఫాం సిద్ధం చేసి ఇచ్చింది.
అకాడమిక్ స్కిల్స్ ఆధారంగా ఎక్కువ నైపుణ్యం ఉన్న విద్యార్థులకు తెల్ల చొక్కాలు, విద్యార్థినులకు తెల్లని టాప్స్.. అలాగే, నైపుణ్యం తక్కువగా ఉన్న విద్యార్థినీవిద్యార్థులకు ఎరుపు రంగు గళ్ల చొక్కాలు, టాప్‌లు ధరించాలని నిబంధన పెట్టి అమలు చేసింది. ఈ జూన్ నుంచి కొత్త విధానం ప్రారంభించారు. విద్యార్థుల మధ్య పోటీ వాతావరణం పెంచడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని తొలుత సదరు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించింది. అయితే, కాలక్రమంలో విద్యార్థులపట్ల తీవ్ర వివక్ష కనిపించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్కూల్‌పై ఫిర్యాదు కూడా చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు.