బన్సల్ కుటుంబానికి నల్లధనం, 30 లాకర్లు!
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి.. ఆ తర్వాత తీవ్రమైన ఆరోపణలతో సీబీఐ విచారణ ఎదుర్కొంటూ మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న బీకే బన్సల్‌కు ఏకంగా 30కి పైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తాజాగా తేలింది. అంతేకాదు.. బీకే బన్సల్, ఆయన కుమారుడు యోగేష్ బన్సల్ ఆత్మహత్య చేసుకోడానికి రెండు రోజుల ముందు.. తమ వద్ద దాదాపు రూ. 2.4 కోట్ల నల్లధనం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపాడు! సెప్టెంబర్ 27వ తేదీన బీకే బన్సల్, ఆయన కొడుకు ఆత్మహత్ చేసుకున్నారు. అంతకుముందు జూలై నెలలో బన్సల్ భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఫార్మాసూటికల్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఈ కుటుంబం ఆత్మహత్యతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు.
అయితే.. ఆత్మహత్య చేసుకోడానికి రెండు రోజుల ముందే యోగేష్ బన్సల్ ఆదాయపన్ను అధికారుల వద్దకు వెళ్లి, తాము దాదాపు కోటి రూపాయల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. తర్వాత సీబీఐ వర్గాలు సెక్యూరిటీ కెమెరాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా మరో కొత్త విషయం తెలిసింది. బీకే బన్సల్‌ను అరెస్టుచేసిన మర్నాడు యోగేష్, ఆయన తల్లి బ్యాంకులకు వెళ్లి, మొత్తం 19 లాకర్లను తెరిచారు. దాంతో ఇప్పటికే భారీగా బంగారు, వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్న ఇంట్లో మరోసారి సీబీఐ వర్గాలు సోదాలు చేశాయి. అప్పుడే అక్కడ భారీ మొత్తంలో నల్లధనం దొరికింది. బహుశా కేసు నుంచి బయట పడేందుకు ఈ డబ్బు వాడుకోవాలని వాళ్లు అనుకుని ఉంటారని.. కానీ అది కుదరదని తేలడంతో ఇప్పుడు బయట పెడుతున్నారని సీబీఐ వర్గాలు భావించాయి. కానీ రెండు రోజుల్లోనే కథ మరో మలుపు తిరిగింది. బీకే బన్సల్, యోగేష్ బన్సల్ ఆత్మహత్య చేసుకున్నారు!!