రెండు నెలల్లో 4 ఆత్మహత్యలు చూసింది!
న్యూఢిల్లీ: ఏడు నెలల క్రితం ఆ ఇంట్లో పనిచేసేందుకు ఆమె చేరింది. రెండు నెలల్లో నలుగురి ఆత్మహత్యలు చూసింది. ఒకే ఇంటిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న నలుగురిని కళ్లారా చూసి షాక్ కు గురైంది. లంచం కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సాల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆత్మహత్యల కేసులో సాక్షిగా నిలిచింది వారింట్లో పనిచేస్తున్న రచనా శ్రీవాస్(17) అనే బాలిక. సోమవారం పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె జవాబిచ్చింది.
మధ్యప్రదేశ్ లోని తికాంగఢ్ ప్రాంతానికి చెందిన రచన తన తండ్రితో కలిసి ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి వచ్చింది. తాపిమేస్త్రిగా పనిచేస్తున్న తండ్రితో కలిసి తూర్పు ఢిల్లీలోని అలా కాలనీలో నివాసం ఉంటోంది. స్థానిక సెక్యురిటీ సాయంతో బన్సల్ ఇంట్లో పనికి కుదిరింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందురోజు తన దగ్గర పనిచేసే వారందరికీ బన్సన్ జీతాలు ఇచ్చారని రచన తెలిపింది. తాము సెలవులు గడిపేందుకు వెళుతున్నామని, నెల రోజుల తర్వాత తిరిగొస్తామని తమతో బన్సల్ చెప్పారని వెల్లడించింది. సీబీఐ బన్సల్ ను అరెస్ట్ చేయడానికి ముందు ఆయన కుటుంబం చాలా సంతోషంగా ఉండేదని చెప్పింది.
‘సీబీఐ అధికారులు తమ బ్యాంకు ఖాతాలు నిలిపివేశారని.. ఇంట్లో బంగారపు వస్తువులు సీజ్ చేసి పట్టుకెళ్లారని, కేవలం రూ.21 వేలు మాత్రమే మిగిల్చారని నాతో బన్సల్ చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ఇంట్లో పనిచేసే వారందరికీ జీతాలు చెల్లించేవార’ని రచన తెలిపింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు బన్సల్ ఇంటి నుంచి తిరివచ్చేస్తుంటే ఆయన కుమారుడు యోగేశ్ తాడుతో కనిపించాడు. తాడు ఎందుకు తెచ్చారని ప్రశ్నించగా ఇంట్లో అవసరాల తెచ్చానని అతడు సమాధానమిచ్చాడ’ని రచన వెల్లడించింది.
తల్లి సత్యబాల, సోదరి నేహ చనిపోయిన తర్వాత యోగేశ్ బాగా కుంగిపోయాడని పొరుగింటివారు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అతడు బాగా నష్టపోయాడని వెల్లడించారు. భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కొడుకుని పెళ్లికి ఒప్పించేందుకు బన్సల్ విఫలయత్నం చేశారని చెప్పారు.