బ్లాక్ బ్యాట్‌పై నిషేధం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్లాక్ కలర్ బ్యాట్ పై నిషేధం విధించారు. ఆటగాళ్ల డ్రెస్ కోడ్ ను బట్టి బ్యాట్ కలర్ కూడా ఉండవచ్చని తొలుత పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా.. దానిపై నిర్ణయాన్ని మార్చుకుంటూ నిషేధం విధించింది. పురుషుల బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ తరపున విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ బ్లాక్ బ్యాట్‌తో బరిలోకి దిగాడు. అయితే బ్లాక్ బ్యాట్ వాడకం వల్ల బంతి కలర్ దెబ్బతింటుందని మ్యాచ్ అధికారులు నివేదిక అందజేశారు. దాంతో బిగ్ బాష్ లీగ్‌లో బ్లాక్ బ్యాట్‌ను నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బిగ్ బాష్ లీగ్ లో బ్లాక్ బ్యాట్ వాడరాదంటూ నిబంధనలను విధించింది.
'మేము బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం. బ్లాక్ బ్యాట్ వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని తొలుత చెప్పినా, బంతిపై నల్లని మరకలు పడుతూ ఉండటంతో ముందస్తు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అది బీబీఎల్ కావొచ్చు.. డబ్యూబీబీఎల్ కావొచ్చు.. ఆటగాడు రస్సెల్ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు..బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం'అని సీఏ పేర్కొంది.
గత బీబీఎల్ సీజన్లో క్రిస్ గేల్ బంగారు పూత కల్గిన బ్యాట్‌ను వాడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు గేల్ బ్యాట్ ను తయారు చేసిన స్పార్టాన్ కంపెనీ.. ఇప్పుడు రస్సెల్ కు బ్లాక్ బ్యాట్‌ను తయారు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత ఈసీబీ నిర్వహించిన లీగ్ లో కూడా ఈ తరహా పరిణామమే చోటు చేసుకుంది. అసర్ జైదీ వాడిన స్ప్రే పెయింట్ బ్యాట్‌పై ఈసీబీ నిషేధం విధించింది.