Black chicken
-
కడక్‌నాద్ కోళ్లపై మధ్యప్రదేశ్‌కే హక్కులు!
నల్ల కోళ్లు.. అదేనండి కడక్‌నాద్ కోళ్లపై ప్రాదేశిక గుర్తింపు(జీఐ) హక్కులను మధ్యప్రదేశ్ దక్కించుకుంది. అనాదిగా గిరిజనులు పెంచి పోషిస్తున్న కడక్‌నాద్ కోళ్ల జాతిపై ప్రాదిశిక గుర్తింపు హక్కుల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల మధ్య గత ఏడాది నుంచి వాదప్రతివాదాలు జరగుతూ వచ్చాయి. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ హక్కు ఇస్తూ మార్చి 28న జర్నల్ 104లో నోటిఫై చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి అంతర్ సింగ్ ఆర్య ప్రకటించడంతో వివాదానికి తెరపడింది. ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాలకు చెందిన గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను అనాదిగా పరిరక్షిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని 21 సహకార సంఘాలలో సభ్యులైన 430 మంది గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను సాకుతూ, పిల్లలను, మాంసాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు. గ్రామీణ్ వికాస్ ట్రస్టు 2012లో గిరిజనుల తరఫున ప్రాదేశిక గుర్తింపు కోరుతూ ధరఖాస్తు చేసింది. ఝబువలో 1978లో తొలి కడక్‌నాద్ కోడి పిల్లల హేచరీ ఏర్పాటైంది. అయితే, ఛత్తీస్‌ఘడ్‌లోని 120 స్వయం సహాయక బృందాల ద్వారా 1600 మంది గిరిజన మహిళలు కడక్‌నాద్ కోళ్ల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నందున వీరికే జీఐ హక్కులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చివరికి మధ్యప్రదేశ్‌కే జీఐ మంజూరైనందున ఇకపై ఈ కోళ్ల జాతిపై సర్వహక్కులు ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాల గిరిజనులకే దక్కాయి. అంటే ‘కడక్‌నాద్’ పేరుతో నల్ల కోళ్లను ఇక మరెవరూ అమ్మటానికి వీల్లేదు. అందేకే, దేశంలో ఎక్కడివారైనా కడక్‌నాద్ కోళ్ల లభ్యతను తెలుసుకొనేందుకు, సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా MP Kadaknath పేరిట హిందీ/ఇంగ్లిష్ మొబైల్ యాప్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కడక్‌నాద్ కోళ్లకు ఎందుకింత క్రేజ్? కడక్‌నాద్ కోడి మాంసం రుచికరమైనదే కాకుండా పోషక విలువలు, ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణ జాతుల కోడి మాంసంలో మాంసకృత్తులు 18% ఉంటే.. ఇందులో 25–27% ఉంటాయి. ఐరన్ అధికం. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకోవడం ఈ కోళ్లకు ఉన్న మరో ప్రత్యేకత. మధ్యప్రదేశ్ ప్రభుత్వ హేచరీలలో ఏటా రెండున్నర లక్షల కడక్‌నాద్ కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ కోడి పిల్లలను తెప్పించి, మన రైతులకు అందజేస్తే వారి ఆదాయం పెరుగుతుంది. -
నల్ల కోళ్లు నాలుగు విధాల మేలు!
‘నలుపు రంగు’.. అయితేనేం? మాంసం రుచి అదరహో! ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువే.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన ‘కడక్‌నాథ్’ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆసక్తి పెరుగుతోంది. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ఫాం హౌజ్‌లలో ‘కడక్ నాథ్’ కోళ్ల సందడి వినిపిస్తోంది. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పంట పొలాల వద్ద ఈ కోళ్ల పోషణ చేపడితే.. పంటలకు ఆశించే పురుగులను తిని పంట ఎదుగుదలకు దోహదపడతాయి. కోళ్ల విసర్జితాలు పంటకు మంచి ఎరువు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కోళ్ల పెంపకంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. ఐరన్ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ అని చెబుతున్నారు. కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైనే. గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. శంషాబాద్ రూరల్ ప్రాంతంలో సురేశ్ అనే యువ రైతు సేంద్రియ పద్ధతిలో ఈ కోళ్లను పెంచి, మాంసం అమ్ముతున్నారు. వీటి గుడ్లను హేచరీలో పొదగేసి ఒక్కో పిల్లను రూ.80లకు అమ్ముతున్నారు. కడక్‌నాథ్ కోళ్ల పోషణ చాలా సులువని, 5 నెలల్లో అమ్మకానికి తగినంత పెరుగుతాయని సురేశ్(99599 52345) చెబుతున్నారు. సురేశ్ – బుర్గు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్), రంగారెడ్డి జిల్లా -
నగరంలో నోరూరిస్తున్న నల్ల కోడి
సాక్షి,వీకెండ్: ఫారం కోళ్లను తినీ తినీ ఉన్నాం. కాబట్టి నాటు కోడి... అంటే అబ్బ ఆ రుచే వేరు అంటూ లొట్టలేస్తాం. బ్రాయిలర్నూ, నాటుకోడినీ తలదన్నేలా.. నగరంలోకి వచ్చేసింది నల్ల కోడి. తల నుంచి పాదాల వరకు ప్యూర్ బ్లాక్ కలర్లో మిలమిల మెరిసే ఈ బ్లాక్ బ్యూటీ అంటే నాన్‌వెజ్ ప్రియులు వావ్ అంటున్నారు. రుచిలో మాత్రమే కాదు ఈ నల్లని కోడి మాంసం ఖరీదులోనూ ఇప్పుడు అధరహో అంటోంది. బ్రాయిలర్ కోడి రేటు కన్నా ఏడింతల ధర పలికే ఈ నల్ల కోడి మాంసం పులుసు, వేపుడు రుచులను జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్ తమ మెనూలో తొలిసారి పరిచయం చేస్తోంది. సేంద్రీయ పద్ధతిలో పెంపకం... మాంసం, ఎముకలు, ఈకలు.. అంతా నల్లగా ఉండే ఈ కోడి కేరాఫ్ ఇండోనేషియా. ఈ కోడిని మిగతా కోళ్లలా కాకుండా అచ్చమైన సేంద్రీయ పద్ధతులలో పెంచుతారు. ఈ నల్లకోళ్ల వ్యాపారానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే గ్యారంటీతో మన దగ్గరా నల్లకోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ‘ఈ నల్లకోడి మాంసానికి మనదైన తెలుగు సై్టల్ రుచిని జత చేసి నల్లకోడి పులుసు, నల్లకోడి వేపుడు... వంటి వెరైటీలను అందిస్తున్నాం’ అని చెప్పారు ఉలవచారు రెస్టారెంట్ యజమాని నరహరి వినయ్ రెడ్డి, మేనేజింగ్ పార్టనర్ విజయరెడ్డిలు. ఈ కోడి తొమ్మిది నెలల్లో కేజిన్నర బరువు పెరిగితే అంతే టైమ్‌లో బ్రాయిలర్ కోడి రెండున్నర కేజీల బరువు తూగుతుంది. అంటే, రెగ్యులర్‌గా లభించే బ్రాయిలర్ చికెన్‌తో పోల్చితే నల్లకోడి మాంసంలో ఏ మాత్రం కొలెస్ట్రాల్ ఉండదని, రుచి అమోఘమని దీని వల్ల తెలుస్తుందని చెబుతున్నారు విక్రేతలు. ప్రస్తుతానికి సిటీ మార్కెట్లో కేజీ నల్ల కోడి మాంసం రూ.800కు పైగా పలుకుతోంది. – సాక్షి వీకెండ్ ప్రతినిధి