blackened face
-
‘ఆయన ముఖానికి నల్ల రంగు పూస్తే 11వేలు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ముఖానికి నల్ల రంగు పూస్తే వారికి బహుమతిగా 11వేలు నగదు ఇస్తామని అలీగఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువ నాయకుడు ప్రకటించాడు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందని థరూర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై యూపీలోని అలీగఢ్‌కు చెందిన ముస్లిం యూత్ అసోషియేషన్ యువ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించాలని డిమాండ్ చేశారు. కేవలం హిందూవులనే కాక దేశంలోని ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా అయన ప్రకటన ఉందన్నారు. హిందూ, ముస్లింలను విభజించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, బీజేపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని, దేశాన్ని హిందూ దేశంగా మారుస్తుందని శశి థరూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. థరూర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
కూతురికి గుండు చేసి.. ముఖానికి నల్లరంగు పూసి..
అప్పటికే పెళ్లయిన తమ కూతురు ఎవరితోనో లేచిపోయిందని.. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామ వీధుల్లో ఊరేగించారు ఆమె తల్లిదండ్రులు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. వారం రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దాంతో ఆమె తండ్రి, భర్త, సవతి తల్లి కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి, తర్వాత పంచాయతీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు ఈ శిక్ష విధించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో యువతి కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని ఇద్దరు గర్భిణులను గత వారం దారుణంగా హతమార్చారు.