రైసుమిల్లుపై దాడులు
కోవూరు/నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: చౌకదుకాణం బియ్యాన్ని అక్రమంగా తరలించి రీసైక్లింగ్ చేస్తున్న సమాచారంతో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదివారం కోవూరు మండలంలోని ఇనమడుగు రోడ్డులో ఉన్న వెంకటసాయి లక్ష్మి రాబాయిల్డ్ రైసుమిల్లు, శెట్టిగుంటరోడ్డు పరమేశ్వరి రైసుమిల్లుపై దాడులు చేశారు. పరమేశ్వరి రైస్‌మిల్లులో తనిఖీలు చేసిన అధికారులు 67.5 క్విం టాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.2.36 లక్షలు అని జేసీ తెలిపారు సుమారు రూ.10 లక్షల విలువైన 934 బస్తాల బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలోని పలు రైసుమిల్లర్లు పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని రీ సైక్లింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రేషన్ బియ్యాన్ని కల్తీ చేసి నాణ్యమైన బియ్యంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే ఇలా అక్రమ వ్యాపారం చేస్తున్న పలు రైసుమిల్లులపై నిఘా పెట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ బృందాలు ప్రతి రోజు ఏదో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. కొడవలూరు మండలం సీఎస్ పురం, కోవూరు మండలం ఇనమడుగు రోడ్డులోని రైసు మిల్లులపై ఈ బృందాలు దాడులు చేసి పేదల బియ్యాన్ని సీజ్ చేశాయన్నారు. ఆయా మిల్లర్లపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో డీఎస్ఓ ఉమమహేశ్వరరావు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ధర్మారెడ్డి, కోవూరు తహశీల్దారు సాంబశివరావు, నెల్లూరు, కావలి ఏఎస్ఓలు శంకర్, శ్రీహరి, సీఎస్‌డీటీ వెంకట్రావు, వీఆర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.